కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ఆ దేవుడే కాపాడాలని మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నాడు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌పై ప్రత్యక్షమయ్యాడు. ప్రస్తుతం భయభ్రాంతులకి గురి చేస్తున్న కరోనా మహమ్మారిని త్వరగా అంతం చేయాలని ఆ శ్రీరామ చంద్రుడిని కోరుకోవాలని ఆయన ట్వీట్ చేశాడు. ప్రజలందరికీ మొదట ఆయన శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపాడు.
ఇంకా ఆయన ట్వీట్‌లో ఏం రాశాడంటే…
“కరోనా నేపథ్యంలో ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలసి సీతారాములను పూజించి వారి అనుగ్రహం పొందాలి. ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వకుండా నియంతల్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులను మనం చూస్తున్నాం. అలాంటిది ప్రజల అభిప్రాయాలకు జీవితాన్ని మించి శ్రీరాముడు విలువ ఇచ్చాదు. అందుకే రామరాజ్యంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించారు” ….అని లోకేశ్ ట్వీట్ చేశాడు.
ఇంతకూ…నియంతల్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులను మనం చూస్తున్నాం అని లోకేశ్ ఎవరి గురించి ఆరోపించినట్టు? జగన్‌ను నేరుగా టార్గెట్ చేసే లోకేశ్, ఇప్పుడు మాత్రం ఎందుకని ప్రస్తావించలేదు. అంటే జగన్ కాకుండా మరెవరైనా లోకేశ్ మనసులో ఉన్నారా? ప‌్రధాని మోడీ గురించి నేరుగా పేరు ప్రస్తావించడానికి ధైర్యం చాలకపోవడంతో, పరోక్షంగా విమర్శలు గుప్పించాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.