మహేశ్.. సినిమాలన్నీ అయిపోవాలంటే ఐదేళ్లు కావాలి!

ఆ మధ్య కన్నడస్టార్ హీరో శివరాజ్ కుమార్ దగ్గర రాబోయే పదహారేళ్లకు తగ్గట్టై స్క్రిప్ట్స్ ఉన్నాయని వార్తలు వచ్చాయి.  శివన్న విని ఓకే చేసిన  కథలన్నీ వరసగా తీసుకొంటూ పోతే పదహారు సంవత్సరాలు పడతాయట.…

ఆ మధ్య కన్నడస్టార్ హీరో శివరాజ్ కుమార్ దగ్గర రాబోయే పదహారేళ్లకు తగ్గట్టై స్క్రిప్ట్స్ ఉన్నాయని వార్తలు వచ్చాయి.  శివన్న విని ఓకే చేసిన  కథలన్నీ వరసగా తీసుకొంటూ పోతే పదహారు సంవత్సరాలు పడతాయట. మరి ఇప్పుడు కథ చెప్పి పదహారో సంవత్సరం వరకూ వేచి చూసే వాళ్లు ఉంటారా? అనేది ఒక సందేహం. 

ఆయన సంగతలా ఉంటే.. ప్రస్తుతానికి మహేశ్ బాబుతో సినిమా చేయాలనే ఉత్సాహం ఉన్న వారు అన్నేళ్లు అవసరం లేదు, కనీసం ఆరో సంవత్సరం వరకూ వేచి చూడాలి.. అనేది తెలుగు ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న మాట. మహేశ్ త్వరలోనే మురగదాస్ దర్శకత్వంలో రూపొందే సినిమాతో బిజీ కానున్నాడు. మరి మురగ తీరు ను చూస్తే అతడు స్టో అండ్ స్టడీ టైప్. సినిమా పూర్తి కావాలంటే మినిమం ఏడాది పైనే పట్టొచ్చు! అంత కన్నా లేటూ కావొచ్చు. 

ఆ సినిమా సంగతి పక్కనపెడితే ఇప్పటికే మహేశ్ కోసం టైటిల్ కూడా ప్రకటించేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. పూరీ ఏమో త్వరత్వరగానే సినిమాను చుట్టేస్తాడు. ఇక జనతా గ్యారేజ్ తర్వాత మహేశ్ కొరటాల శివతో మహేశ్ కు ఒక సినిమా ప్రతిపాదన ఉంది. ఎలాగూ శ్రీమంతుడుతో మంచి హిట్టు ఇచ్చిన దర్శకుడు కాబట్టి కొరటాలను మహేశ్ కాదనుకోలేడు. వీళ్ల సంగతి ఇలా ఉంటే.. మహేశ్, త్రివిక్రమ్ సినిమా ప్రతిపాదన ఈ నాటిది కాదు. 

ఖలేజాతో మ్యాజిక్ చేయలేకపోయిన వాళ్లు కలిసి హిట్టు కొట్టాలని చాలా కాలం నుంచే సమాలోచనలు చేస్తున్నారు. ఇద్దరికీ తీరిక  దొరికినప్పుడు ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.  అలాగే తమిళ దర్శకుడు సుందర్.సి ఒక భారీ బడ్జెట్ సినిమా ప్రతిపాదన ఇప్పటికే చేసేశాడు. తమిళంలో విజయ్ ,తెలుగులో మహేశ్ లు ఈ సినిమా ను చేయనున్నారట.

ఇవి గాక.. ఒకరిద్దరు తమిళ దర్శకులు కూడా మహేశ్ నామస్మరణ చేస్తున్నారు. వారిని పక్కన పెట్టినా.. మిగతా సినిమాలన్నింటినీ పూర్తి చేయాలన్నా మినిమం ఐదారు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అంటే.. కొత్తగా మహేశ్ కోసం కథలను రాసుకునే ఉత్సాహం ఉన్న వాళ్లు మినిమం ఐదేళ్లు వేచి చూడాలనమాట!