మహేష్ బాబుతో అనిల్ సుంకర, దిల్ రాజు నిర్మించే సినిమా త్వరలో సెట్ మీదకు వెళ్లబోతోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ విషయాలన్నీ తెలిసినవే. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ మీద మల్లగుల్లాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇది ఎలా వీలయినంత తగ్గించడం అనేది పాయింట్.
ఎందుకంటే ఈ సినిమా నాన్ థియేటర్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తం అంతా మహేష్ బాబు రెమ్యూనిరేషన్ కిందకే వెళ్తుంది. అది సుమారు 52 కోట్ల వరకు వుంటుందని అంచనా. ఇక మిగిలిన థియేటర్ రైట్స్ లోంచి ప్రొడక్షన్ కాస్త పోనూ లాభాలు. ఆరంభంలో అనిల్ రావిపూడి కనుక 60 నుంచి 70 కోట్లో ప్రొడక్షన్ కాస్ట్ వుంటుందని అంచనా వేసారు అని తెలుస్తోంది.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా 90 కోట్ల వరకు లెక్క తేలుతోందని బోగట్టా. 9 కోట్లు అనిల్ రావిపూడికి, 3 కోట్లు విజయశాంతికి, మిగిలిన రెమ్యూనిరేషన్లు పాతిక కోట్ల వరకు అవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది. వంద రోజులు ప్రొడక్షన్ చేయాలి. అందులో ఇరవై రోజులు కాశ్మీర్ ఎపిసోడ్ వుంది. రెండు భారీ సెట్లు వుంటాయని తెలుస్తోంది. ఇవికాక పబ్లిసిటీ, వడ్డీలు ఇతరత్రా ఖర్చులు వుంటాయి.
ఇదే విషయమై నిర్మాత దిల్ రాజు ఇటీవల హీరో మహేష్ బాబుతో సమావేశం అయి చర్చించినట్లు తెలుస్తోంది. మహర్షి సినిమాకు వడ్డీలు భారీగా పడ్డాయి కాబట్టి, ప్రొడక్షన్ అంతాకలిపి 140 దాటిందని, ఇప్పుడు అంత వుండదు కదా? అని మహేష్ పాయింట్ చేసినట్లు తెలుస్తోంది. తన రెమ్యూనిరేషన్ తగ్గించుకోవాలని దిల్ రాజు అభిప్రాయామా అని మహేష్ ఆరా తీసినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది.
తను మీడియం సినిమాలు తీస్తే కనీసం అయిదు కోట్ల వరకు మిగుల్తుందని, ఇంత భారీ సినిమాను లాభం వచ్చేలా ఎలా ప్లాన్ చేయాలన్నదే తన అభిప్రాయం అని దిల్ రాజు వివరించినట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాకు ఏం మిగిలినా అనిల్ సుంకర-దిల్ రాజు ఇద్దరూ పంచుకోవాలి. ప్రస్తుతానికి డిస్కషన్లు అలా ఆగినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.