రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ భారీస్థాయిలో ఫోకస్ పెట్టింది. పలుకుబడి ఉన్నాలేకపోయినా, పదవిలో ఉన్నా పాతబడినా వీరూ వారూ అని లేకుండా వచ్చిన వారందర్నీ కమలంలో కలిపేసుకుంటోంది. ఈ కలయికలతో పార్టీకి ఏమేరకు లాభముందో చెప్పలేం కానీ, పార్టీ మారిన నేతలకు మాత్రం తాత్కాలిక ఉపశమనం దొరికినట్టే. కేసులు ఎదుర్కుంటున్న నేతలంతా జాతీయ పార్టీ అండ అడ్డంపెట్టుకుని బతికిపోవచ్చు. అసలేమాత్రం పలుకుబడి లేని మాజీనేతలు సైతం కాషాయ కండువాతో హడావిడి చేయొచ్చు. ఇంతా జరిగితే ఏపీ ఆపరేషన్ తో బీజేపీకి ఏంలాభం?
ఇలా నాయకులందర్నీ పార్టీలో చేర్చుకుని బీజేపీ ఏం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో సొంతగా కొన్ని స్థానాలైనా నెగ్గుతుందా అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. 2014ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో ఆమాత్రం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లొచ్చాయంటే అది టీడీపీ, జనసేనతో జట్టుకట్టిన ఫలితమే. ఒంటరిగా పోటీచేస్తే బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు. 2019ఎన్నికలే దీనికి తాజా ఉదాహరణ.
పోనీ ప్రత్యేకహోదా అనే అపవాదే లేదనుకున్నా కూడా ఏపీలో బీజేపీకి ఏమాత్రం సీన్ లేదనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఒకరకంగా వెంకయ్య నాయుడిని సైడ్ ట్రాక్ లోకి నెట్టేసిన తర్వాత ఏపీపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నేతల్ని భారీగా రిక్రూట్ చేసుకుంటోంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఏపీలో సొంతంగా సీట్లు సంపాదించాలనేది బీజేపీ భావన. ఉత్తరాదిన తేడాకొడితే.. దక్షిణాది మెజార్టీతో కేంద్రంలో చక్రం తిప్పాలని ఇప్పట్నుంచి పథకం ప్రకారం ముందుకు వెళ్తోంది బీజేపీ.
అయితే ఏపీలో ఉన్న పరిస్థితులు ఏమాత్రం ఆ పార్టీకి అనుకూలంగా లేవు. 2024లో కాదు కదా.. ఆ తర్వాత ఐదేళ్లకు కూడా బీజేపీ సోలోగా ఏపీలో బోణీ కొడుతుందంటే అనుమానమే. జనసేనను కలిపేసుకుని, టీడీపీతో కుమ్మక్కయితే చెప్పలేం కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అది అడియాసే అవుతుంది. వైసీపీ ధాటిని తట్టుకుని నిలబడ్డం టీడీపీ వల్లే కాలేదు, ఇక బీజేపీ ఏం చేస్తుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న వలస చేపలన్నిటినీ వచ్చే ఎన్నికల వరకూ కాపాడుకుంటే అదే బీజేపీకి ఏపీలో పెద్ద విజయం అని చెప్పాలి.