నానా తంటాలూ పడి, ఎలాగోలా రామ్‌చరణ్ 'తని ఒరువన్' సినిమా రీమేక్ చేసేస్తున్నాడు. హీరోగా రీ-ఎంట్రీ ఇచ్చే విషయంలో చిరంజీవి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎప్పటినుంచో రకరకాలుగా ఆలోచించి, చాలామంది దర్శకుల్ని లైన్‌లో పెట్టి, చివరికి వినాయక్‌తో సెటిలైపోయారు చిరంజీవి. పవన్‌కళ్యాణ్ ఇంకా కన్‌ఫ్యూజన్ లోంచి బయటకు రాలేదు.
ప్రస్తుతం మహేష్ పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదట. మురుగదాస్‌తో సినిమాని మహేష్ ఎప్పుడో అనౌన్స్ చేసేశాడు. అతి త్వరలో సినిమా పట్టాలెక్కాల్సి వుంది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళితే సినిమా శరవేగంగా పూర్తయిపోతుందనే వాదనలు ఓ పక్క విన్పిస్తోంటే, ఇంకోపక్క సినిమా విషయంలో కన్‌ఫ్యూజన్ కొనసాగుతోందన్న ప్రచారమూ జరుగుతోంది.
మురుగదాస్‌తో సినిమా అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, ఇప్పుడు మురుగదాస్ మరీ అంత ఖాలీగా లేడు. ఓ పక్క బాలీవుడ్‌లో 'అకిరా' సినిమా తెరకెక్కించేస్తున్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వమే కాదు, నిర్మాణ బాధ్యతల్నీ తీసుకున్నాడు మురుగదాస్. ఇక్కడ, తెలుగులో మహేష్‌ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక్కడో వస్తోంది చిక్కు అంతా. సబ్జెక్ట్ విషయంలో చిన్నపాటి కన్‌ఫ్యూజన్స్ వున్నాయనీ, మహేష్ అడుగుతున్న క్లారిటీ మురుగదాస్‌లో కనిపించడంలేదనీ గుసగుసలు గుప్పుమంటున్నాయి.
అయితే, కన్‌ఫ్యూజన్స్ ఏమీ లేవనీ, అంతా ఓకే అయిపోయిందనీ, సెట్స్ మీదకు వెళ్ళడానికి ముహూర్తం ఖారరయ్యిందనీ మహేష్ సన్నిహితులనుంచి సమాచారం అందుతోంది. మహేష్ – మురుగదాస్ 'ఆల్ ఈజ్ వెల్' అనుకోవచ్చా.? హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో కన్‌ఫ్యూజన్ కొనసాగుతోందని అనుకోవాలా.? ఏమో మరి మహేష్, మురుగదాస్‌లకే తెలియాలి. అన్నట్టు.. హీరోయిన్ విషయంలో ఇటు మహేష్, అటు మురుగదాస్ మధ్య గ్యాప్ పెరిగిందన్నది తాజా ఖబర్. సినిమా లేట్ అవడానికి ఇది మాత్రమే కారణం అని అనలేంగానీ, ఇది కూడా ఓ కారణం కావొచ్చునట.