మొన్నీమధ్యనే దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 'యోగా'కి ప్రాచుర్యం కల్పించి, ప్రపంచ దేశాలు 'యోగా'పై మక్కువ చూపేలా చేసి, అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేదాన్నొకటి జరుపుకునేలా చేయడంలో ప్రధాని నరేంద్రమోడీ సూపర్ సక్సెస్ అయ్యారు. యోగాని ముస్లింలలో కొందరు వ్యతిరేకిస్తున్నా, ఇస్లామిక్ కంట్రీస్ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొనడం గమనార్హం.
ఇక, మన దేశంలో యోగా దినోత్సవ నిర్వహణ విషయానికొస్తే, కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందిక్కడ. ఆయా ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని నిర్వహించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం విదితమే. బెంగళూరులో బాలీవుడ్ నటి బిపాసా బసు యోగాసనాలు వేసి అందర్నీ అలరించింది. శిల్పాశెట్టి కూడా ఓ నగరంలో యోగాసనాలు వేసింది. యోగా విశేషాల్ని సెలబ్రిటీలు చెబుతోంటే, యోగా పట్ల కొత్త కొత్తగా అందరిలోనూ అవగాహన పెరుగుతుందన్నది నిర్వివాదాంశం.
అంతా బాగానే వుందనుకుంటే ఎలా.? ఇక్కడా ఓ పితలాటకం వుంది. బిపాసా బసు, యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా 'ఛార్జ్' చేసిందట. ఆమె 'రేటు' చూసి అంతా షాకవుతున్నారిప్పుడు. అంతసేపు యోగా గురించి లెక్చర్లు దంచిన బిపాసా, ఒక్కరోజు.. అదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున, డబ్బులు తీసుకోకుండా వుండలేకపోయిందా.? ఇదా ఆమెకు సమాజం పట్ల వున్న బాధ్యత.? అని జనం ముక్కున వేలేసుకున్నారు. అయినా, ఆమెకు అంత మొత్తం చెల్లించడమేంటి, ప్రజాధనం దుర్వినియోగం చేయడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు తెలంగాణ హరిత హారం విషయానికొద్దాం. సెలబ్రిటీలు కెమెరాలకు పోజలిచ్చేస్తున్నారు మొక్కలు నాటుతూ. అఖిల్, రకుల్ ప్రీత్‌సింగ్, రాశి ఖన్నా, అల్లు అర్జున్.. ఇలా పలువురు సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ మీడియా ముందు హల్‌చల్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. సందట్లో సడేమియా, నాటిన మొక్కల్నీ కొందరు తొక్కేశారనే ఆరోపణలూ లేకపోలేదు.
అంతా బాగానే వుందిగానీ, అందాల భామలు ఊరికినే వస్తారా.? వారికీ ఓ రేటుంటుంది. తెలంగాణ సర్కార్, ఏమాత్రం ఖర్చు చేయకుండానే సెలబ్రిటీలని రప్పించేసి, వారితో మొక్కలు నాటించేసిందా.? ఇక్కడా బిపాసా బసు లాంటి వ్యవహారమేమీ జరగలేదా.? ఇలా సవాలక్ష అనుమానాలు తెరపైకొస్తున్నాయి. హీరోల తీరు వేరు, హీరోయిన్ల పద్ధతి వేరు. రూపాయి కూడా తీసుకోకుండా హీరోయిన్లు మొక్కలు నాటితే అభినందించాల్సిందే. కానీ, మొక్కలు నాటడానికీ డబ్బులు గుంజితే, ముందు.. పాలకుల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. ఏమంటారు.?