కొన్నిసార్లు కొన్ని పనులు ఎలా ఎందుకు చేసినా, ఇంకోలా అనిపించడం అన్నది పరిస్థితుల ప్రభావం. ఎప్పుడూ లేనిది ఓ సూపర్ స్టార్ ఫంక్షన్ కు మరో టాప్ స్టార్ అతిథిగా వస్తున్నారు. అభిమానుల్లో మహేష్, ఎన్టీఆర్ వేరు వేరే. అయితే ఓ మంచి వాతావరణం ఏర్పరచడానికి అన్నట్లు మహేష్ పిలిచాడో, కొరటాల శివ కోరాడో మొత్తానికి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నాడు. అయితే దీనికి ఫ్యాన్స్ వర్గాల్లో మాత్రం మహేష్ బాగా భయపడుతున్నాడు అనే వినిపిస్తోంది.
స్పైడర్ సినిమా ఇలా షో పడిన కొద్ది గంటలకే బిళ్ల బీటుగా నిలువునా కిందకు జారిపోయింది. సినిమాలో విషయం లేకపోతే, ఏ సినిమా అయినా ఇలా జారిపోవాల్సిందే. అయితే స్పైడర్ మీద మరీ భయంకరంగా జరిగిన ప్రచారం వెనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన నెగిటివ్ ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపిందని మహేష్ నమ్మాడు. అప్పట్లో ఇదే విషయం మీద చాలా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ సోషల్ మీడియా టీమ్ ను కూడా మహేష్ అనుమానించాడు అన్న వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి.
ఇలాంటి నేపథ్యంలో కోరి ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలవడం అంటే, భరత్ అనే నేను సినిమాకు నెగిటివ్ చేయకుండా అతగాడి ఫ్యాన్స్ కు గేలం వేయడమే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం, స్పైడర్ ల వంటి ఫ్లాపుల తరువాత వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా సక్సెస్ మహేష్ కు ఆక్సిజన్ లాంటింది. ఇది కానీ తేడా వస్తే మహేష్ పరిస్థితి ఊహించలేం.
అందుకే ఎక్కడా ఏ తేడా రాకూడదని మహేష్ జాగ్రత్త పడుతున్నాడో, భయపడుతున్నాడో మరి. ఎన్టీఆర్ ను సభకు పిలిచారు. హీరో కృష్ణ, మహేష్ బాబులతో సమానంగా భారీ ఎన్టీఆర్ కటౌట్లు పెడుతున్నారు. అలాగే ఎన్టీఆర్ వస్తున్నాడు అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. మరో పక్క ఇదే టైమ్ లో రంగస్థలం సినిమా మీద మహేష్ ట్వీట్ లు కురిపించాడు. అంటే ఆ విధంగా మెగా ఫ్యాన్స్ ను కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడనుకోవాలి.
సీనియర్ ఎన్టీఆర్ కు హీరో కృష్ణకు చుక్కెదురు అన్నది అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడు బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ కు చుక్కెదురు అన్నదీ తెలిసిందే. ఇప్పుడు హీరో కృష్ణ వారసుడు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గరకు చేసుకోవాలనుకోవడం కాకతాళీయమా? ఏమో?
మొత్తం మీద భరత్ అనే నేను సినిమాకు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, అటు మెగా ఫ్యాన్స్ కానీ నెగిటివ్ చేయకుండా మహేష్ గట్టి వ్యూహమే రచించి జాగ్రత్త పడుతున్నట్లుంది. ఇవన్నీ ఎలా వున్నా సినిమాలో విషయం వుండాలి. దమ్ము వుండాలి. ఆపైనే ఈ వ్యూహాలన్నీ.