టైటిల్ తోనే సినిమాకు ఫస్ట్ హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే టైటిల్ ను గ్రాండ్ గా ఎనౌన్స్ చేయాలనుకుంటారు మేకర్స్. అవసరమైతే అదే టైటిల్ తో ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయాలని భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా గ్రాండ్ ఎనౌన్స్ మెంట్ కంటే ముందే టైటిల్ బయటకు వచ్చేస్తుంది. గతంలో అత్తారింటికి దారేది విషయంలో ఇదే జరిగింది. ఆ సినిమా టైటిల్ ను మంచి రోజు చూసి అఫీషియల్ గా ప్రకటిద్దాం అనుకున్నారు. అంతలోనే హీరోయిన్ సమంత, ఆ టైటిల్ ను ట్విట్టర్ లో పెట్టేసింది. ఇప్పుడు మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ వ్యవహారం కూడా ఇలానే మారింది.
త్వరలోనే కొరటాలశివతో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొరటాల ఇప్పటికే స్క్రీన్ ప్లే ఫైనలైజ్ చేశాడు. దేవిశ్రీప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు. కొరటాలతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందంటూ దేవిశ్రీ ట్వీట్ చేశాడు. 4 ఫొటోలు కూడా షేర్ చేశాడు. అక్కడితో ఆగకుండా అత్యుత్సాహం కొద్దీ “భరత్ అనే నేను” అనే టైటిల్ ను కూడా హ్యాష్ ట్యాగ్ చేశాడు.
వాస్తవానికి ఈ టైటిల్ ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. మహేష్-కొరటాల సినిమా పక్కా అయినప్పుడే ఈ టైటిల్ కూడా బయటకు వచ్చింది. అయితే తమ సినిమా టైటిల్ ఇది కాదంటూ అప్పట్లో కాస్త సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు కొరటాల. దీంతో టైటిల్ పై బజ్ తగ్గింది. మళ్లీ ఇన్నాళ్లకు దేవిశ్రీ ట్వీట్ తో మహేష్ సినిమా టైటిల్ ఇదేనని అంతా ఫిక్స్ అయిపోయారు.