మహేష్‌బాబు చిత్రాలన్నిటికీ విడుదలకి ముందు విపరీతమైన క్రేజ్ వస్తోంది. అయితే ఆ చిత్రాలు ఏమాత్రం ఆ అంచనాలకి తగినట్టు లేకపోయినా కానీ రివర్స్ అవుతోంది. తన ప్రతి సినిమాకీ విడుదలకి ముందే యాభై కోట్లకి పైగా బిజినెస్ జరుగుతున్నప్పుడు ఆషామాషీ చిత్రాలు చేస్తే ఫలితాలు దారుణంగానే వస్తాయి మరి.
ఈమధ్య తన చిత్రాలకి ఖర్చు మరీ శృతి మించి పోతున్నా కానీ మహేష్‌బాబు దాని మీద దృష్టి పెట్టలేదు. అదంతా నిర్మాత, దర్శకుల తలనొప్పి అన్నట్టుగా బడ్జెట్‌ని మహేష్ లెక్క చేయలేదు. కానీ ఓవర్ బడ్జెట్ కారణంగా 1, ఆగడు చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో మహేష్ మేల్కొన్నాడు. ఇకపై తన చిత్రాలకి బడ్జెట్ అదుపులో ఉంచాలని నిర్ణయించుకున్నాడు.
కొరటాల శివతో చేసే చిత్రాన్ని నలభై, నలభై అయిదు కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసాడు. అందుకు అనుగుణంగా పక్కా స్క్రిప్ట్‌తో సెట్స్ మీదకి వెళ్లనున్నారు. ఎక్కడా వేస్టేజ్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ సినిమాలకి బడ్జెట్‌ని అదుపులో ఉంచినట్టయితే ఫలితం తారుమారు అయినా కానీ నష్టాలు తీవ్రంగా ఉండకుండా చూసుకోవచ్చునని మహేష్ ఒక్కడే కాదు… స్టార్ హీరోలందరూ ఒక్కొక్కరుగా రియలైజ్ అవుతున్నారు.