నలుగురికి నచ్చినది.. నాకు అసలే నచ్చదురో.. పరులెవరు నడవనిది.. ఆ రూట్లోనే నడిచెదరో.. పొగరని ఎందరు అన్నా, అది మాత్రం నా నైజం.. తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం
ఇది ఏ సినిమాలోదో, ఎవరి సినిమాలోదో కొత్తగా కోట్ చేయనక్కరలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి అసలే చెప్పనక్కరలేదు. చంద్రబోస్ రాసిన ఈ పాట చాలా మందికి వివిధ సామాజిక మాధ్యమాల్లో సేటస్‌గా కూడా మారిపోయింది. నిజానికి రచయితలు హీరోచిత పాటలు రాసేటపుడు ఆ పాట ఎవరికోసం రాస్తున్నారో, వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుంటారు.
సూపర్ స్టార్ వారసుడికి ప్రయాణం ప్రారంభించిన మహేష్ తనే ఓ సూపర్ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఈ పాటలోని లైన్లు జనాలకు చాలాసార్లు గుర్తుకు వచ్చాయి. రోటీన్ తరహా సినిమాలు చేయకుండా, కాస్త విభిన్నమైన తరహా సినిమాలు చేస్తూ వచ్చాడు. హిట్‌లు ఫ్లాప్‌లు పట్టించుకోకుండా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్లాడు. మొత్తంమీద మరే హీరోకి లేని విధంగా ఎన్ని ఫ్లాపులున్నా, తాను సూపర్ స్టారే అనిపించుకున్నాడు. ప్రతి సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళ్లాడు.
అక్కడి దాకా బాగానే వుంది. తనదారి తనది, తన పద్దతి తనది అనుకున్నది సబ్జెక్ట్‌ల వరకు బాగానే వుంటే వుండొచ్చు కానీ, మారుతున్న కాలంలో, సినిమా పరిశ్రమలో వున్న పరిస్థితుల్లో మాత్రం సెట్ అవ్వడం లేదేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డొంకతిరుగుడు లేకుండా క్లియర్‌గా చెప్పాలంటే, తెలుగు చిత్రసీమలో రాను రాను మహేష్ బాబు ఒంటరి అవుతున్నాడేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈతరం యంగ్ హీరోల మధ్య ఎంత పోటీవుందో అంత సాన్నిహిత్యం కూడా వుంది. పవన్-వెంకీ మంచి మిత్రులు. రామ్‌చరణ్-ఎన్టీఆర్‌కు మాంచి సాన్నిహిత్యం వుంది. బన్నీ అయితే దాదాపు అందరు యంగ్ హీరోలతో టచ్‌లో వుంటాడు. నితిన్-అఖిల్ మంచి ఫ్రెండ్స్. నాని-శర్వానంద్ మంచి మిత్రులు. ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకుంటారు. రానా-చైతన్య బావ బామ్మర్దులకన్నా స్నేహితులుగానే ఎక్కువగా వుంటారు. ప్రభాస్‌కు గోపీచంద్ అన్నా, శర్వానంద్ అన్నా భలే ఇష్టం.
అంతేకాదు దర్శకులు కూడా హీరోలతో మాంచి సాన్నిహిత్యం పెట్టుకున్నారు. త్రివిక్రమ్-పవన్ స్నేహం తెలిసిందే. కొరటాల శివ-ఎన్టీఆర్‌కు మాంచి బంధం వుంది. దర్శకుడు రాజమౌళికి కూడా ఎన్టీఆర్ అంటే బోలెడు ఇష్టం. అది బహిరంగంగానే చెప్పాడు. ఇప్పుడు కొత్తగా సురేందర్ రెడ్డి-చరణ్ ఫ్యామిలీ బాగా దగ్గరయ్యారు. బాలయ్య-బోయపాటికి మధ్య మాంచి అనుబంధం వుంది. ఇలా చాలా అంటే చాలా మందికి మాంచి స్నేహాలు వున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. కానీ అదే మహేష్ బాబుకు ఏ హీరోకి మాంచి సాన్నిహిత్యం వుందీ అంటే గట్టిగా సమాధానం రాదు ఎవరి నుంచీ. పోనీ మహేష్‌కు ఏ డైరక్టర్‌కు మాంచి సాన్నిహిత్యం వుందీ అన్నా అదే సమస్య.
కుటుంబమే అంతా
మొదటి నుంచీ మహేష్ బాబు తన కుటుంబమే అంతా అన్నట్లే వుంటూ వస్తున్నారు. అయితే సినిమా లేకుంటే ఫ్యామిలీ. ఏడాదికి మూడు నాలుగుసార్లు వీలయితే ఫ్యామిలీతో వెకెషన్‌కు వెళ్లరావడం. లేదూ అంటే ఇంట్లో వుండడం. అంతకు మించి మరే సినిమా జనాలకు దగ్గరయినట్లు కనిపించదు. అలా వెళ్లే వెకెషన్లలో కూడా ఆయన, ఆయన భార్య, పిల్లలు తప్ప మరెవరు కనిపించరు. బావలు, అన్న, ఇంకా ఇతర ఫ్యామిలీ మెంబర్లు ఎక్కడా కనిపించిన దాఖాలాలు చాలా తక్కువ.
మహేష్‌కు దగ్గరయిన వ్యక్తిగా కేవలం దర్శకుడు మెహర్ రమేష్‌ను మాత్రమే ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. బాబీ సినిమాలో నటించిన దగ్గర నుంచి మెహర్ రమేష్ దగ్గరయ్యారు. మహేష్ కనుక ఒక్కరూ ఎక్కడికన్నా వెళ్లాలంటే ఈ మధ్యకాలంలో మెహర్ రమేష్‌ను తోడుగా తీసుకెళ్లడం కాస్త అలవాటు చేసుకున్నారు. అంతకు మించి మహేష్ బాబుకు దగ్గరయిన వారు ఎవరన్నా వున్నారా అంటే అనుమానమే. బావల ఫంక్షన్‌కు ఏదో వెళ్లడం, మాట్లాడిరావడం అంతే. అంతకుమించి మహేష్ దగ్గరయిన దాఖలాలులేవు. గతంలో సోదరికి, అన్నకి డేట్లు ఇచ్చి, సమర్పించు అని వేయించిన సందర్భాలు వున్నాయి కానీ, స్వంత బ్యానర్ పెట్టిన తరువాత అది కూడా మాయమైంది.
కానీ మిగిలిన వారు అలాకాదు. ఎన్టీఆర్ పూర్తిగా హరికృష్ణ ఫ్యామిలీతో కలిసిపోయారు. మెగా ఫ్యామిలీ విసృతి చిన్నదికాదు. అందరూ ఒక్కటిగా కనిపిస్తూనే వున్నారు. ఒక్క బన్నీ మాత్రమే కాస్త అటు ఇటు అవుతున్నట్లు వార్తలు వినిపించాయి. అక్కినేని-దగ్గుబాటి ఫ్యామిలీల బంధం పటిష్టంగానే వుంది. మహేష్ కూడా తన ఫ్యామిలీ అంతటితో బంధాలు కలిగివున్నారు. కానీ వారెవరి సహాయం మహేష్‌కు లభిస్తున్నట్లు కనిపించదు. కానీ ఇక్కడ అలాకాదు, మిగిలిన హీరోలకు వారి వారి కుటంబ బాంధవ్యాలు బాగా కలిసివస్తున్నాయి.
పెళ్లితో మరింత దూరం
సినిమా హీరోలకే కాదు, ఎవ్వరికైనా పెళ్లిళ్లు అన్న కొత్త బంధాలను తీసుకొస్తాయి. రామ్‌చరణ్ అపోలో, కామినేని గ్రూప్‌తో కలిసినా, ఎన్టీఆర్ నార్నేతో వున్నా, బన్నీ అత్తింటి వైపు నుంచి ఇలా చాలా మందికి కనిపించని సపోర్టు లభిస్తోందనే అనుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, దాదాపు హీరోలంతా తమ తమ సామాజిక వర్గంలోనో లేదా, మరో తెలుగు సామాజిక వర్గంలోనో అమ్మాయిలతో సంబంధాలు కలుపుకున్నారు.మ ఒక్క మహేష్ తప్ప. (పవన్ వ్యవహారాలు వేరు).
అందువల్ల ఆయా సామాజిక వర్గ సపోర్టు క్లియర్‌గా హీరోలకు ఇంతో అంతో లభిస్తోంది. లాభిస్తోంది. కానీ మహేష్ దగ్గరకు వచ్చేసరికి. ఆయన ఇలాంటి సామాజిక బంధాలకు దూరంగా వుంటున్నారు. బావ గల్లా జయదేవ్ రాజకీయంగా, ఆర్థికంగా బలమైన శక్తి అయినా కూడా, దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం మహేష్ చేసినట్లు కనిపించదు.
సినిమా రంగంలో కనిపించని కులాల ఈక్వేషన్లు చాలా వున్నాయి. హీరోలు ఈ విషయంలో ఎలావున్నా, ఇండస్ట్రీలో వున్నవారు, అభిమానుల్లో అధికశాతం మంది, ప్రజల్లో కులాలపై అభిమానం వున్నవారు మాత్రం ఈ ఈక్వేషన్లను బాగా పట్టించుకుంటారు. చిరకాలంగా కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యంలో వున్న తెలుగు సినిమా పరిశ్రమ, రాను రాను వివిధ కులాల మధ్య పోటీగా మారింది. మెగాక్యాంప్ బలోపేతం కావడంతో కాపు సామాజికవర్గం హ్యాపీగా ఫీలయింది. ప్రభాస్ పెద్ద హీరో కావడంతో క్షత్రియ వర్గం గర్వంగా భావిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి బలమైన హీరో కావాల్సి వచ్చింది.
బాలయ్య, నాగార్జున, వెంకీలు సీనియర్లు అయిపోయారు. కావడానికి చాలామంది వున్నా, భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోలు ఇక ఇద్దరే మిగిలారు కమ్మ సామాజిక వర్గానికి ఎన్టీఆర్-మహేష్ బాబు. కానీ మహేష్ బాబు ఈ ఈక్వేషన్లను, సామాజికవర్గ వ్యవహారాలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. పైగా కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అండగా వుంటుంది. మహేష్‌బాబు కుటుంబంలో ఎవరు ఏ పార్టీనో అన్నట్లు వుంటారు. దీంతో ఇక ఆ సామాజిక వర్గం మాత్రం, పార్టీతో ఎన్టీఆర్ అనుబంధం ఎలావున్నా, అతనినే తమ హీరోగా ఫిక్సయిపోయినట్లు కనిపిస్తోంది.
ఇదెక్కడ కలిసి వస్తోంది?
కులసమీకరణాలు ఎన్నికల్లో విజయానికే కాదు, సినిమాల విజయానికి కూడా దోహదం చేస్తాయన్నది నికార్సయిన వాస్తవం. మరీ డిజాస్టర్ సినిమా అయితే ఎవ్వరూ ఏమీ చేయలేరు కానీ, ఎంత డిజాస్టర్ అయినా యాభైకోట్ల మార్కెట్ వుంది అని అనిపించుకోవడానికి మాత్రం కులాల ఈక్వెషన్లు కలిసి వస్తాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక టాక్ వుంది.. సినిమా కాస్త ఏవరేజ్ అయితే చాలు బన్నీ, పవన్, ఎన్టీఆర్ కొంతవరకు లాక్కు వెళ్లగలరు.
ఈ ముగ్గురి సినిమాలు ఏవరేజ్ అనిపించుకున్నా, బయ్యర్లకు పదిశాతం మాత్రమే తేడా వస్తుంది తప్ప, యాభైశాతం రాదు. అన్నది ఆ టాక్. కానీ అదే మహేష్ బాబు దగ్గరకు వచ్చేసరికి ఏవరేజ్‌లు వుండడంలేదు. డిజాస్టర్లే. దాంతో అతని సినిమాలకు యాభైశాతం లాస్ వస్తోంది నిర్మాతలకు, బయ్యర్లకు. ఇలాంటి లెక్కలనే నిర్మాతలు చూసుకుంటారు. వాటిని బట్టే హీరోల మార్కెట్, సేప్ కెరీర్ వుంటుంది.
పైగా మిగిలిన హీరోలందరికీ ఫిక్స్‌డ్ బయ్యర్లు దాదాపుగా వున్నారు. హీరోలు మార్కెటింగ్‌లో కాస్త కలుగచేసుకుని, తమ టీమ్ ఆఫ్ బయ్యర్లకు సినిమాలు ఇప్పిస్తూ, తమ తమ సినిమాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ సినిమా కలెక్షన్లు ఎలావున్నా అవి వాస్తవంగా బయటకురావు. ఒకవేళ మూడువారాల తరువాత కాస్త డౌన్ అయినా, తాము నమ్ముకున్న హీరో కోసం మరోవారం ఖర్చులు భరించి లాగిస్తారు. ఇలాంటి ఉపయోగాలు చాలా వుంటాయి. కానీ మహేష్ దగ్గర అస్సలు ఇలాంటి వ్యవహారాలు ఏమీ వుండవు. తను అనుకున్న రెమ్యూనిరేషన్ అందిందా లేదా? తను సినిమా చేసి ఇచ్చేసానా? లేదా? అంతే.
మార్కెటింగ్ మీద దృష్టే లేదు
తనను తను మార్కెట్ చేసుకోవడం అన్నది ఈకాలంలో చాలా అవసరం. ప్రకటనలు సంపాదించే విషయంలో చురుగ్గా వున్న మహేష్ తన సినిమాల మార్కెట్ విషయంలో మాత్రం నీరసంగా వున్నారు. సినిమాలు మార్కెట్ కావాలంటే ఈరోజుల్లో రెండు కీలక అవసరాలు వున్నాయి. ఒకటి సోషల్ మీడియాలో సపోర్టు. రెండవది అభిమానుల సపోర్టు. అదే విధంగా సోషల్ మీడియాలో సపోర్టు కూడా రెండు విధాలుగా వస్తుంది. ఒకటి అభిమానుల ద్వారా. రెండు ఖర్చు పెట్టుకోవడం ద్వారా. ఇలా అన్నింటిలోనూ మహేష్ బాగా వీక్‌గా వున్నట్లు తెలుస్తోంది.
జనతాగ్యారేజ్ టైమ్ నుంచి ఎన్టీఆర్ మారిపోయారు. తన అభిమానులను దగ్గరకు పిలవడం, వాళ్లతో ఫోటోలు దిగడం, అభిమానుల డేటాబేస్ నిర్వహించేందుకు మనుషుల్ని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ల ద్వారా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో వుండడం ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇలాంటివి అన్నీ మహేష్ దగ్గరకు వచ్చేసరికి దాదాపు జీరోనే. శ్రీమంతుడు టైమ్‌లో నమ్రత కొంతవరకు అభిమానులతో టచ్‌లో వున్నారు. కానీ ఆ తరువాత మళ్లీ అదేలేదు.
స్పైడర్ సినిమా విడుదలయిన తెల్లవారుఝాము నుంచే మహేష్ సినిమా మీద అటాక్ స్టార్ట్ అయింది. సినిమా ఏవరేజ్ నో డిజాస్టర్ నో తరువాతి సంగతి. కానీ అభిమానులు తమ హీరోను డిఫెండ్ చేసుకుంటారు కానీ వదలరు. కానీ అలాంటిది పెద్దగా స్పైడర్ విషయంలో అస్సలు కనిపించలేదు. బాలయ్య, ఎన్టీఆర్, పవన్, బన్నీ, చరణ్ అభిమానుల హడావుడి అటు సోషల్ నెట్‌వర్క్ లోనూ, బయటా కూడా ఎలా వుంటుందో తెలిసిందే.
మహేష్ దగ్గరకు వచ్చేసరికి అలాంటి హడావుడే కనిపించదు. ఇక ఏవరేజ్ సినిమాకు సపోర్ట్ ఎక్కడి నుంచి లభిస్తుంది. హీరో కష్ణ అంటే ఇప్పటికీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ వున్నారు. కృష్ణ నటించడం మానేసినా, వారు ఆయననే అభిమానిస్తారు. కానీ అలా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మహేష్‌కు ఏర్పడుతున్నారా? అన్నిది అనుమానమే.
సినిమా ఏవరేజ్ అయినపుడు హీరో అనేవాడు మొహం చాటేయకూడదు. బయటకు రావాలి. కానీ మహేష్ స్పైడర్ సినిమా ముందే లెక్కగా మీడియాను కలిసారు. ఇక అంతే. ఆ తరువాత గాయబ్. ఎన్టీఆర్‌ను మీడియాను క్రిటిసైజ్ చేసినా, పెద్దగా ప్రతిస్పందన రాకపోవడానికి కారణం, ఆయన మీడియాతో తరచు టచ్‌లో వుంటూ, దగ్గరగా వున్న ఫీల్ కలిగించడమే. దాంతో ఏదో అన్నాడులే అని మీడియా సరిపెట్టేసుకుంది. అలాంటి మీడియా సాన్నిహిత్యం అన్నది మహేష్ నుంచి ఎప్పటికీ ఊహించలేవేమో?
హీరోల బాధ్యతలు పెరిగాయి
ఇప్పుడు హీరో అంటే సినిమా చేస్తే సరిపోదు. మంచి సినిమా అయితే జనం దగ్గరకు ఎలాగూ వెళ్లిపోతుంది. కానీ కాస్త అటు ఇటుగా వున్న సినిమా అయితే హీరో వ్యవహారాలు అన్నీ కౌంట్‌కు వస్తున్నాయి. అభిమానులు బలంగా వుండాలి. సోషల్ మీడియాలో అభిమానులు యుద్దానికి సిద్ధంకావాలి. బయ్యర్లు కూడా హీరో మనుషులై వుండాలి. మీడియాతో హీరోకు సత్సంబంధాలు వుండాలి.
అన్నిటికి మించి హీరో తనదీ సినిమా అని ఎంతకిందకు దిగాలో అంతా దిగి ప్రచారం సాగించుకోవాలి. ఇన్నిచేస్తే తప్ప, ఏవరేజ్ సినిమాలు బ్రేక్ ఈవెన్‌కు రావు. మరి ఇలాంటి టైమ్‌లో, మహేష్‌బాబు లాంటి హీరో అభిమానులను పెద్దగా పట్టించుకోక, వాళ్లను కోఆర్డినేట్ చేసే సరైన మనిషి దగ్గర లేక, సోషల్ మీడియాను ఆర్గనైజ్ చేయలేక, తనకంటూ ఓ టీమ్ ఆఫ్ బయ్యర్లు లేక సినిమాలకు బలం ఎలా వస్తుంది.
అలా అంటే సినిమాలో విషయం వుంటే అదే ఆడుతుంది అని సులువుగా అనేయచ్చు. నిజమే. సినిమాలో సూపర్ విషయం వుంటే నిజంగానే ఆడతాయి. కానీ పెద్ద హీరోలతో పెద్ద డైరక్టర్లు నిర్మించే పెద్ద సినిమాలు అంత సూపర్ విషయం వున్నవిగా రూపొందడం అన్నది ఇప్పటి కాలంలో కష్టం అవుతోంది. బాహుబలి లాంటి సినిమాకే ఎన్ని విధాలా మద్దతు లభిస్తే కానీ నిల్చోలేదన్న విషయం గమనించాలి. ఏదయినా తనచుట్టూ తను గీసుకున్న గీతలను దాటి మహేష్ బయటకు రావాలి. ఒంటరి నుంచి మళ్లీ ఒక్కడు అనే స్టేటస్ తెచ్చుకోవాలి. అప్పుడే నిర్మాతలు ధైర్యంగా మహేష్‌తో సినిమాలు తీయగలుగుతారు.
-ఆర్వీ