కరోనా కల్లోలం నేపథ్యంలో అన్ని లెక్కలు మారుతున్నాయి. అన్ని వ్యాపారాల పునాదులు కదులుతున్నాయి. సినిమాలు కూడా కరోనాకు అతీతం కాదు. అందుకే హీరోల రెమ్యూనిరేషన్లు తగ్గుతాయేమో అన్న చిన్న అనుమానాలు వున్నాయి. కానీ టాలీవుడ్ లో అది సాధ్యం కాదనే వాదనలూ వున్నాయి.
హీరో మహేష్ బాబు సాధారణంగా నాన్ థియేటర్ హక్కులను తన పారితోషికంగా తీసుకుంటారు అని వార్తలు వున్నాయి. ఇవి 45 కోట్ల నుంచి 50 వరకు పలుకుతాయి. కానీ ఇప్పుడు ఆయన తన పద్దతి మార్చుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
పైగా శ్రీమంతుడు తరువాత మహేష్ సినిమాల వల్ల నిర్మాతలు డబ్బులు తిన్నది లేదు అన్న రూమర్లు ఇండస్ట్రీలో బలంగా వున్నాయి. భరత్ అనే నేను సినిమా తరువాత నిర్మాత దానయ్య-డైరక్టర్ కొరటాల శివ అమ్మకాలు, లాభనష్టాల విషయంలో కిందా మీదా అయ్యారని వార్తలు వున్నాయి. మహర్షి సినిమాలో నిర్మాత పివిపి కి రూపాయి రాలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా సంగతి నిర్మాత అనిల్ సుంకర కే తెలియాలి.
ఇలాంటి నేపథ్యంలో ఈసారి మహేష్ బాబు స్కీము మార్చారని తెలుస్తోంది. సినిమాకు మొత్తం పెట్టుబడి మైత్రీ మూవీస్ ఫైనాన్స్ ద్వారా సమకూరుస్తుంది. వడ్డీలు ఖర్చుల్లో వేస్తారు. అమ్మకాల్లోంచి సినిమా నిర్మాణం ఖర్చు మొత్తం పోను, లాభాలను ముగ్గురూ సమానంగా పంచుకుంటారు. అంటే మైత్రీ మూవీస్, 14రీల్స్, మహేష్ బాబు అన్నమాట.
కానీ ఇలా చేయడం వల్ల మహేష్ రెమ్యూనిరేషన్ బాగా తగ్గిపోయే అవకాశం వుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 50 కోట్లలో సినిమా ఫినిష్ చేసి, వంద కోట్ల లాభం సాధించినా మహేష్ కు దక్కేది 35 కోట్లు మాత్రమే అవుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాగే ముందుకు వెళ్లక తప్పదని భావించడం వల్లనే మహేష్ ఈ డీల్ కు ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ రేంజ్ ఇదే. అలాగే బన్నీ కూడా.