ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. అరెస్ట్‌కు ఒక్కరోజు ముందు ఆయన పైల్స్‌కు ఆపరేషన్ చేయించుకున్నాడు. అరెస్ట్ అనంతరం ఆయన్ను కంటిన్యూగా వాహనంలో తిప్పడంతో రక్తస్రావమైంది. దీంతో జడ్జి ఆదేశాల మేరకు ఆయనకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.
అచ్చెన్న అరెస్ట్ మరుసటి రోజే వాహనాల కుంభకోణంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జేసీ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ విషయాన్ని జేసీ లాయర్ నార్పల రవికుమార్‌రెడ్డి తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తుంటి ఎముక నొప్పితో బాధ పడుతున్నట్టు ఆయన చెప్పారు. దీంతో ఆయనకు ఎక్స్‌రే కూడా తీశారన్నారు. జేసీ అనారోగ్యానికి సంబంధించి వైద్య నివేదికలను మెజిస్ట్రేట్ ముందు ఉంచినట్టు అడ్వొకేట్ తెలిపారు.
విచారణ నిమిత్తం పోలీసులు రెండు రోజుల కస్టడీకి జేసీతో పాటు ఆయన తనయుడిని కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కస్టడీ ముగిసింది. విచారణలో అన్ని ఆధారాలతో ప్రభాకర్‌రెడ్డి సమాధానం ఇచ్చినట్టు లాయర్ వెల్లడించారు. కాగా అచ్చెన్నకు చేసినట్టే జేసీకి కూడా ఏదైనా ఆపరేషన్ లాంటిది చేయాల్సి వస్తుందా? లేక మామూలు తుంటి నొప్పా అనే విషయం న్యాయ స్థానంలో తేలాల్సి ఉంది.