డిజిటలైజేషన్ పెరిగిన తరువాత సినిమాలకు పబ్లిసిటీ పెరిగింది. సమస్యలూ పెరిగాయి. కంటెంట్ ను దాచడం కష్టం అవుతోంది. మహేష్ బాబు 25వ సినిమా టీజర్ ఈనెల 9న ఉదయం 9గంటలకు విడుదల కాబోతోంది. అయితే ఫ్యాన్స్ చాలా హుషారుగా వుంటారు. తమ తమ అభిమాన హీరో వ్యవహారాలు, అప్ డేట్ లు ఎంత త్వరగా, ఎంత ముందుగా తెలుసుకుందామా? అని చూస్తూ వుంటారు. కేవలం, జస్ట్ ఆసక్తి, ఉత్సాహం కారణంగానే చాలా పెద్ద సినిమాల ప్రచారపు కంటెంట్ ముందుగా లీక్ అయిపోతూ వుంటుంది.
దాంతో అది ఒరిజినల్ కాదని, ఫ్యాన్ మేడ్ అని, ఇంకోటి అని చెప్పి, మళ్లీ మరోటి రెడీ చేయడం కూడా జరిగిన సంగతే. అందుకే మహేష్ బాబు 25వ సినిమా ఫస్ట్ పబ్లిసిటీ మెటీరియల్/ఫస్ట్ లుక్/జర్నీ బిగిన్స్ ను దర్శకుడు వంశీ పైడిపల్లి తన దగ్గరే వుంచుకున్నారట. సాధారణంగా యూనిట్ లో కీలమైన వాళ్లకు షేర్ చేయడం, అలాగే డిజిటల్ పబ్లిసిటీ వింగ్ కు ముందుగా ఇవ్వడం, అప్ లోడ్ చేయించడం వంటివి వుంటాయి. కానీ అవి కూడా పక్కనపెట్టి అలా వుంచారట. అప్ లోడ్ కు మహా అయితే రెండు మూడు గంటలు పడుతుంది.
అందువల్ల మార్నింగ్ ఆరు నుంచి తన సమక్షంలోనే లోడింగ్ కూడా జరిగేలా దర్శకుడు ఏర్పాట్లు చేసుకున్నట్లు వినిపిస్తోంది. ఒక్క దిల్ రాజు, హీరో మహేష్ బాబు మాత్రమే ఇప్పటి వరకు ఈ జర్నీ బిగిన్స్ ను చూసినట్లు తెలుస్తోంది.
తొమ్మిదివ తేదీ తొమ్మిది గంటలకు బయటకు వస్తుంది ఇది.