మహేశ్.. మరీ అంత ఉందంటావా?!

‘చెక్కా చివంత వానం’ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు మహేశ్ బాబు. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఈ సినిమాను తన హోం థియేటర్లో చూశానని.. భలే ఉందని, ఈ సినిమాను ఇంకా చూడని వాళ్లు…

‘చెక్కా చివంత వానం’ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు మహేశ్ బాబు. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఈ సినిమాను తన హోం థియేటర్లో చూశానని.. భలే ఉందని, ఈ సినిమాను ఇంకా చూడని వాళ్లు వెంటనే టికెట్లు కొనుక్కొని వెళ్లి చూసేయాలని మహేశ్ ఉచిత సలహా ఇచ్చాడు.

తెలుగులో నవాబ్ గా విడుదల అయిన మణిరత్నం సినిమాను మహేశ్ బాబు ప్రశంసించడాన్ని ఏం తప్పు పట్టనక్కర్లేదు కానీ.. మరీ ఎక్కువ పొగిడేయడం మాత్రం ఇక్కడ గమనార్హం. ఈ సినిమాపై ట్వీట్లు పెడుతూ.. దీన్ని మూవీ ఆఫ్ ద డికేడ్ గా అభివర్ణించాడు మహేశ్. ఇది మాత్రం ఓవరే.

ఈ దశాబ్దానికే అత్యుత్తమ సినిమా అనేది ‘నవాబ్’కు మితిమీరిన ప్రశంస. తన ఫేవరెట్ ‘ది గాడ్ ఫాదర్’లోని కొన్ని ఎపిసోడ్స్ ను తీసుకుని ఈ సినిమాను అల్లేశాడు మణిరత్నం. గాడ్ ఫాదర్ క్లైమాక్స్ ను ఉన్నట్టుండి ఒక పోలీసోడి యాంగిల్ ‌కు మార్చడమే మణిరత్నం ఈ సారి చేసిందల్లా. అలాగని ఈ సినిమా మరీ నిరాశపరచదు కానీ.. మణిరత్నం గత కొన్నేళ్లలో తీసిన కడల్, చెలియా వంటి సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అంతే. ఈ మాత్రం దానికే మూవీ ఆఫ్ ద డికేడ్ అంటే మాత్రం ఓవరే మహేశూ!

ఇక్కడ మరో సందేహం ఏమిటంటే.. కొన్నేళ్ల కిందట మణిరత్నం ఒక స్క్రిప్ట్ తో మహేశ్, నాగార్జునలను ఒప్పించాడని వార్తలు వచ్చాయి. అప్పట్లో మణిరత్నం సినిమాకు ఓకే చెప్పినట్టుగా మహేశ్ ట్వీటేశాడు కూడా. మహేశ్, నాగార్జునలతో పాటు మరో ఇద్దరు తమిళ స్టార్లు కూడా ఈ సినిమాలో ఉంటారని అప్పట్లో సుహాసిని స్వయంగా ప్రకటించింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు. అప్పుడాగిన సినిమా ఇప్పుడు ‘చెక్కా చివంత వానం’గా వచ్చిందా?