బిగ్‌బాస్‌ హోస్ట్‌గా నాని ఏం సాధించాడు.?

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 2 ముగిసింది. హోస్ట్‌గా నాని ఈ షో ద్వారా ఏం సాధించాడు.? అన్న చర్చ జరుగుతోందిప్పుడు. ఎందుకంటే, సీజన్‌ వన్‌ చాలా హుషారుగా నడిస్తే.. సీజన్‌ టూ…

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 2 ముగిసింది. హోస్ట్‌గా నాని ఈ షో ద్వారా ఏం సాధించాడు.? అన్న చర్చ జరుగుతోందిప్పుడు. ఎందుకంటే, సీజన్‌ వన్‌ చాలా హుషారుగా నడిస్తే.. సీజన్‌ టూ మాత్రం నీరసంగా సాగింది. ఇందులో ఇంకో మాటకు తావులేదు. 'చాలా నేర్చుకున్నా..' అని నాని, సీజన్‌ ముగింపు సందర్భంగా 'ఫినాలె'లో మాట్లాడినా, అది 'తప్పనిసరై' మాట్లాడిన మాట మాత్రమేనన్నది చాలామంది అభిప్రాయం. రియాల్టీ షో ద్వారా ఎంతో కొంత నేర్చుకునే అవకాశమైతే వుందిగానీ.. ఈ షో ద్వారా నాని పొందిన 'లాభం' కంటే నష్టమే ఎక్కువ.

హోస్ట్‌గా నాని ఇంత పెద్ద రియాల్టీ షోని, తన భుజాన మోయలేకపోయాడనే భావనే అందరిలోనూ వుంది. సీజన్‌ వన్‌ విషయాన్నే తీసుకుంటే, నో డౌట్‌.. ఎన్టీఆర్‌ అద్భుతంగా నిర్వహించేశాడు. ప్రతి వీకెండ్‌లోనూ ఎన్టీఆర్‌ రాక కోసం బుల్లితెర వీక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. వారి అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్‌, వీకెండ్స్‌లో అలరించేసేవాడు. హౌస్‌ మేట్స్‌తో మాట్లాడటం, షోని పరుగులు పెట్టించడం.. ఇలా ఎన్టీఆర్‌ చాలానే చేశాడు.

హౌస్‌లోకి ఎన్టీఆర్‌ ఎంటరయి, కుకింగ్‌ చేసేయడం.. మొత్తంగా బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ వన్‌కే హైలైట్‌ అంటే, అది అతిశయోక్తి కాదేమో. 'మళ్ళీ ఎన్టీఆర్‌ మాత్రమే రెండో సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించాలి..' అని అంతా అనుకున్నారు ఆ సీజన్‌ ముగిశాక. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు.. 'ఇంకోసారి నాని హోస్ట్‌ చేస్తాననడం మంచిది కాదు.. ఆయనకు అవకాశమిస్తే అంతే సంగతులు..' అంటూ మెజార్టీ అభిప్రాయం వ్యక్తమవుతోంది సోషల్‌ మీడియాలో. 

సీజన్‌ వన్‌లోనూ హౌస్‌ మేట్స్‌ మధ్య గొడవలు జరిగాయి.. సీజన్‌ టూలో కూడా జరిగాయి. కానీ, సీజన్‌ టూ మరీ దారుణంగా తయారైంది. హౌస్‌ మేట్స్‌ మధ్య రాజీకుదర్చడానికి నాని చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, హౌస్‌మేట్స్‌ సైతం నానిని లైట్‌ తీసుకున్నారనడం కరెక్టేమో.! బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌ నడుస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ 'జై లవకుశ' సినిమా చేశాడు. సీజన్‌ 2 విషయానికొస్తే, నాని ఏకంగా రెండు సినిమాలు చేసేశాడనుకోండి.. అది వేరే విషయం. 

మొత్తమ్మీద, నాని బిగ్‌ బాస్‌ సీజన్‌ టూతో చేదు అనుభవాల్నే ఎక్కువగా చవిచూశాడు. సీజన్‌ ముగిశాక కూడా హోస్ట్‌గా నానిపై వ్యతిరేకత సోషల్‌ మీడియాలో ఇంకా తగ్గకపోవడం గమనార్హం.