బాహుబలి భళ్లాలదేవుడ్ని చంపే సీన్ వచ్చినప్పుడు థియేటర్లన్నీ చప్పట్లు, అరుపులతో హోరెత్తాయి, సైరాలో నరసింహారెడ్డి ఆంగ్లేయుల తలలు నరికినప్పుడు దాదాపు అలాంటి భావోద్వేగానికే గురయ్యారు ప్రేక్షకులు. చివర్లో నరసింహారెడ్డి తలను వేలాడదీసినప్పుడు కన్నీళ్లు ఆగలేదంటూ స్టేట్ మెంట్స్ కొంతమంది. ఎలా చూసుకున్నా బాహుబలికి సైరా ఏమాత్రం తీసిపోదు అంటూ తొలిరోజు కొందరు స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. మరి లెక్క ఎక్కడ తేడాకొట్టింది. ఏపీలో మినహా మిగతా అన్నిచోట్ల బాహుబలితో సైరా ఎందుకు పోటీ పడలేకపోతోంది?
తెలుగు ప్రేక్షకులు మినహా మిగతా జనాలు సైరాను తమ చిత్రంగా ఓన్ చేసుకోలేకపోయారు. దీనికి కారణం కథ, కథనం. రాజమౌళి తెలివిగా బాహుబలిని ఓ యూనివర్సల్ సబ్జెక్ట్ గా మార్చేశాడు. మాహిష్మతి అనే ఓ అందమైన ఊహాలోక సామ్రాజ్యాన్ని సృష్టించారు. మాహిష్మతి తెలుగువాళ్లది కావచ్చు, కన్నడ వాళ్లది కావొచ్చు, తమిళనాడు వాళ్లూ ఓన్ చేసుకోవచ్చు. ఉత్తరాదిలో కూడా మాహిష్మతి ఉండొచ్చనే భ్రమ కలిగించారు. కానీ సైరా విషయానికొస్తే.. ఇది కేవలం తెలుగు రాష్ట్రానికి చెందిన కర్నూలు జిల్లా కథ అని అర్థమైపోతోంది. లేదంటే ఓ సౌత్ సినిమాగా మాత్రమే ముద్రపడింది.
సైరా ప్యాన్-ఇండియా చిత్రంగా మారకపోవడానికి ప్రధాన అడ్డంకి ఇదే. దీన్ని అధిగమించడం కూడా కష్టమే. ఎందుకంటే ఇది చరిత్ర. సైరాని పూర్తి ఫిక్షన్ గా మారిస్తే తొలి తరం తెలుగు స్వాతంత్ర యోధుడిని తగ్గించి చూపించినట్టవుతుంది. అందుకే ఆ సాహసం చేయలేదు. ఉన్నంతలో సినిమా రీచ్ పెంచేందుకు ఇతర రాష్ట్రాల నటీనటుల్ని తీసుకున్నప్పటికీ, కథ మూలాలు ప్రాంతీయం కావడంతో సినిమా జాతీయస్థాయికి వెళ్లలేకపోయింది.
అందుకే సైరా నరసింహారెడ్డి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే దైవంలా కనిపించాడు. పక్క రాష్ట్రాల్లో ప్రభావం అంతంతమాత్రంగానే చూపించాడు. ఈ ప్రభావమే కలెక్షన్లపై పడిందని అంటున్నారు. సో.. సైరాకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్కోప్ అంతే, అయితే చిరంజీవి సినిమా కాబట్టి అభిమానులు పోటెత్తడంతో తొలిరోజు కలెక్షన్లు గట్టిగా వచ్చాయి. ఫ్యాన్స్ సందడి తగ్గాక, కలెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ సంగతి పక్కనపెడితే.. బాహుబలికి, సైరాకు నెరేషన్ లో కూడా చాలా తేడా కనిపించింది.
బాహుబలి సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఓ హై-పాయింట్ కనిపిస్తుంది. ఆ ట్విస్ట్ లు, ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. సైరా అనేది చరిత్రకు సంబంధించిన సినిమా అయినప్పటికీ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని అలాంటి సన్నివేశాలు రాసుకోవచ్చు. ఆ ప్రయత్నం జరిగింది కానీ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఉదాహరణకు చిరంజీవి ఇంట్రో సీన్ ను అండర్-వాటర్ లో చూపించారు. ఇలా కాకుండా, మదంతో ప్రజలపైకి దూసుకొస్తున్న ఎద్దుల్ని నియంత్రించే సన్నివేశంలో చిరంజీవి ఇంట్రడక్షన్ పెట్టి ఉంటే అదిరిపోయేది.
ఇవన్నీ పక్కనపెడితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పుట్టుక నుంచి చూపించాల్సిన అవసరం లేదని, తమన్నతో లవ్ ట్రాక్ పెట్టాల్సిన అవసరం లేదని వాదించేవాళ్లు చాలామంది. ఇవి లేకుండా ఉన్నట్టయితే, తొలి 30 నిమిషాలు సినిమా బోర్ కొట్టి ఉండేది కాదు. నరసింహారెడ్డి పాత్రను కేవలం ఓ స్వతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే చూపించలేదు. అతడి పాత్ర చుట్టూ ఓ భారీతనాన్ని చూపించారు. వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. బాహుబలికి నరసింహారెడ్డి ఏమాత్రం తీసిపోడు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేశారు.
సరిగ్గా ఇక్కడే సైరాకు బాహుబలికి మధ్య పోలిక వచ్చింది. బాహుబలిని చూసిన కళ్లతో సైరాను చూశారు ప్రేక్షకులు. ఈ రెండు సినిమాల్ని, ఈ రెండు పాత్రల్ని పోల్చిచూడడం అక్కడ్నుంచే మొదలైంది. అదే ఇప్పుడు సమస్యగా మారింది కూడా.