మరికాసేపట్లో సాహో సినిమా నుంచి మేకింగ్ వీడియో లాంటిది ఒకటి బయటకు రాబోతోంది. ఇదేదో ప్రభాస్ పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా విడుదల చేస్తున్న వీడియా కాదు. ఇదే చివరాఖరిది కూడా కాదు. ఈరోజు నుంచి ఈ వీడియోల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ విషయంలో సాహోకు బాహుబలే ఆదర్శం.
బాహుబలి సినిమాకు సంబంధించి రాజమౌళి ఇలాంటి ప్రచార వ్యూహాన్నే అనుసరించాడు. సందర్భానుసారంగా రకరకాల వీడియోలు విడుదల చేశాడు. అలా విడుదల వరకు బాహుబలి వేడి చల్లారకుండా చూసుకున్నారు. ఇప్పుడు సాహోకు కూడా అదే పని చేయబోతున్నారు.
ఈ వీడియోలన్నింటికీ 'షేడ్స్ ఆఫ్ సాహో' అనే పేరు పెట్టారు. ఈరోజు చాప్టర్-1 విడుదలవుతోంది. ఇక నుంచి చాప్టర్ల వారీగా వీడియోలు వస్తాయన్నమాట. ఒక్కో చాప్టర్ లో ఒక్కో యాంగిల్ ఉంటుందన్నమాట. సాహో యూనిట్ ఇలా పనిగట్టుకొని మరీ బాహుబలి కాన్సెప్ట్ ను మక్కికిమక్కి ఫాలో అవ్వడానికి ఓ బలమైన రీజన్ ఉంది.
సమ్మర్ కు వస్తుందనుకున్న ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 15కు మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. అప్పటివరకు సినిమాపై బజ్ ను కొనసాగించాలంటే, కేవలం ఫొటోలు విడుదల చేస్తే సరిపోదు. ఇలా షేడ్స్ ఆఫ్ సాహో కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకురావాల్సిందే. చాప్టర్ల వారీగా వీడియోలు విడుదల చేయాల్సిందే. ప్రస్తుతం యూనిట్ చేస్తోంది అదే.
తెలుగు, తమిళ, హిందీ బాషల్లో దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను సమ్మర్ లో థియేటర్లలోకి తీసుకురావాలంటే ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ పోటీ ఎక్కువగా ఉంది. తెలుగులో అయితే మహేష్, చిరంజీవి సినిమాలు పెద్ద పోటీ. అందుకే పంద్రాగస్ట్ కు సినిమాను వాయిదావేశారు.