సంక్రాంతి అంటే హీరో బాలకృష్ణకు మా చెడ్డ సరదా. సంక్రాంతికి తన సినిమా ఒకటి వుండాలనుకుంటారు. అలాగే చూసుకుంటూ వస్తున్నారు. అలాగే వచ్చే సంక్రాంతిపై కూడా ఇప్పుడే రుమాలు వేసేసారు. ఎన్టీఆర్ బయోపిక్ ను రాబోయే సంక్రాంతికి విడుదల చేస్తామని ఆయన చెప్పేసారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అమరావతి వచ్చిన ఆయన అక్కడ మాట్లాడినపుడు ఈ విషయం వెల్లడించారు. ఈ నెల 29న ప్రారంభిస్తామని కూడా చెప్పారు.
అయితే ఆ తరువాత రెగ్యులర్ షూట్ ఎప్పుడు వుంటుందో ఇంకా చెప్పలేదు. బహుశా జూన్ నుంచి వుంటుందేమో? అంటే ఆరునెలల్లో తీసి విడుదల చేయాలని సంకల్పం పెట్టుకున్నారన్నమాట.
ఇటీవల చేతికి ఆపరేషన్ చేయించుకున్న బాలయ్య ఆ కట్టుతోనే అసెంబ్లీకి వచ్చారు. ఇదేం పెద్ద గాయం కాదని, తనకు తగిలిన గాయాల్లో ఇది చిన్నదని బాలయ్య అనడం విశేషం.