తెరవెనక్కు పోయింది, కామప్ అయిపోయింది అనుకున్న డ్రగ్స్ కేసు మళ్లీ పడగవిప్పేలా కనిపిస్తోంది. సినిమా సెలబ్రిటీలు చాలామంది ఇన్ వాల్వ్ అయిన డ్రగ్స్ కేసు విషయంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందట. రావడం విశేషం కాదు. ఆ నివేదికలో ఒక సినిమా సెలబ్రిటీ రక్తంలో మాదకద్రవ్యాల వాడకం నమూనాలు వున్నట్లు తేలిందని తెలిసిందట.
సినిమా సెలబ్రిటీలను కొంతమందికి నోటీసులు పంపి, రప్పించి, రక్తపరీక్ష నమూనాలు సేకరించిన సంగతి తెలిసిందే. మరి ఆ సెలబ్రిటీ ఎవరన్నది బయటకు తెలియదు. ఎందుకంటే అధికారులు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్డుకు అందిస్తారు కనుక. ఆ విషయం అప్పుడే బయటకురాదు.
వాస్తవానికి 12మంది విచారణకు హాజరైతే ఆరుగురినే బ్లడ్ శాంపిల్స్ అడిగారు. వారిలో ముగ్గురు నిరాకరించారు. ముగ్గురు ఇచ్చారు. ఆ ముగ్గురిలో ఈ ఒక్కరు ఎవరు అన్నది తెలియాల్సి వుంది.
పద్ధతి ప్రకారం ఫోరెన్సిక్ నివేదికను కోర్టులో సబ్ మిట్ చేసారని తెలుస్తోంది. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోర్టుకు దరఖాస్తు చేసి ఆ నివేదికను తీసుకోవాలి. ఆపైన దాని ఆధారంగా సిట్ తదుపరి చర్యలు వుంటాయి. కావాలంటే ఆ వ్యక్తిని అరెస్టు కూడా చేసే అధికారం కూడా వుంటుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
మొత్తంమీద ముగిసిందనుకున్న డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టించేలాగే వుంది చూస్తుంటే.