మంత్రిని వెంటాడుతున్న మాజీ మంత్రి

మంత్రి జయరాం ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వదలడం లేదు. బెంజ్ కారు ఉదంతం చల్లారక ముందే మరో విషయం బయటకు లాగారు. జయరాం భార్య, ఇంకా మరదలు పేరిట రెండు వందలకు పైగా…

మంత్రి జయరాం ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వదలడం లేదు. బెంజ్ కారు ఉదంతం చల్లారక ముందే మరో విషయం బయటకు లాగారు. జయరాం భార్య, ఇంకా మరదలు పేరిట రెండు వందలకు పైగా ఎకరాలు ఇటీవలే రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ సాక్ష్యాలు బయటకు లాగారు.

ఈ భూములను ఓ సంస్థ నుంచి బెదిరించి లాక్కున్నారని అయ్యన్న ఆరోపించారు.  భూములు అమ్మడానికి కంపెనీ అంగీకరించింది అంటూ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫోర్జరీది అని, అలాగే యాభై లక్షలకు పైగా నగదు రూపంలో చెల్లించారని, అయ్యన్న వెల్లడించారు.

జయరాం ను అయ్యన్న తరచు టార్గెట్ చేయడం, ఇప్పటికే జయరాం మూడు సార్లు వివాదాస్పద ఆరోపణలకు గురికావడం చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతున్నట్లే వుంది. వైకాపాలోని అంతర్గత రాజకీయాలు జయరాం గుట్టు మట్టలను తేదేపా నాయకులకు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇలా జరుగుతుందని తెలిసీ జయరాం లాంటి రాజకీయ నాయకులు ఇలా వ్యవహరించడం మరీ దారుణం.

ఒకపక్క సిఎమ్ జగన్ అవినీతి రహిత పాలన అందించాలని కిందా మీదా అవుతుంటే, ఓ మంత్రి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడం, ఆయనకు ఆయనే తన పదవి మీదకు తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

రాయలసీమ ఎమ్మెల్యేను ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే టార్గెట్ చేయడం అన్నది తెలుగుదేశం వ్యూహంలో భాగం కావచ్చు. కృష్ణ, గుంటూరు జిల్లాల నేతలు అయితే రాయలసీమ సెంటిమెంట్ వచ్చే ప్రమాదం వుంది. అదే ఉత్తరాంధ్ర నేత, సీమ నేతను టార్గెట్ చేస్తే, వాళ్లు వాళ్లు చూసుకుంటారు. 

ఇలాంటి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య. ఆ విద్యను ప్రదర్శిస్తున్నారు దానికి అయ్యన్న పాత్ర ధారిగా మారారు. జయరాం టార్గెట్ అవుతున్నారు. ఈ లెక్కన చూస్తుంటే జయరాం మంత్రి పదవిలో ఎన్నాళ్లో వుండేలా కనిపించడం లేదు.

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి