బాహుబలి విలన్, లీడర్ హీరో రానా మాంచి జోష్ మీద వున్నాడు. బాహుబలి తరువాత తను సోలోగా చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా వున్నాడు. కోరి మరీ అడిగి, ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చాడు. ఎన్టీఆర్ అభిమానులు అంతా తన సినిమా చూడాలని బిగ్ బాస్ వేదికపై నుంచి అపీల్ చేసాడు. తన అభిమానులే కాదు, అందరి హీరోల అభిమానులు చూస్తారని ఎన్టీఆర్ అభయం ఇచ్చాడు.
ఓ డిఫరెంట్ మూవీ చేసానని, పైగా తన పెర్ ఫార్మెన్స్ కూడా డిఫరెంట్ గా వుంటుందని భావిస్తున్న రానా, నేనే రాజు నేనే మంత్రి సినిమాకు ప్రీమియర్ వేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు ఇప్పటికే సురేష్ బాబుకు ఓ ప్రపోజల్ పెట్టేసారు. అయితే సినీమాక్స్ లో లేదంటే, ప్రసాద్ ఐమాక్స్ లో 10వ తేదీ రాత్రి సెలబ్రిటీ ప్రీమియర్ షో వేస్తే ఎలా వుంటుంది అని నిర్మాతలు ప్రతిపాదించారు.
కానీ రానా తన సినిమా కోసం సెలబ్రిటీలను పిలవడం ప్రారంభిస్తే, ఇండస్ట్రీ మొత్తం ఆ లిస్ట్ లో వుంటుంది. ఒక షో సరిపోదు. అందుకే ఆలోచిస్తున్నారు. వేయాలా? వద్దా? వేస్తే ఎన్ని షో లు వేయాలి? ఇలా డిస్కషన్లు సాగుతున్నాయి.
ప్రస్తుతం ఓవర్ సీస్ కీ స్, ఇతరత్రా ఫార్మాలిటీల వ్యవహారంలో బిజీగా వున్న రాజు-మంత్రి యూనిట్, ఆ పని ముగిసిన తరువాత ప్రీమియర్ పై నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.