జై లవకుశ సినిమా ఫినిష్ చేసేసాడు. బిగ్ బాస్ షో పూర్తయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫుల్ రిలాక్స్. త్వరలో యుకె, మలేషియా వెళ్లి రెండు నెలల పాటు రెస్ట్ తీసుకుని వస్తాడు. అంటే డిసెంబర్ కు ఎన్టీఆర్ మళ్లీ రెడీ. కానీ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సిన దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం రెడీగా లేరు. ఆయన తను పవన్ తో చేస్తున్న సినిమాను జనవరి ఫస్ట్ వీక్ విడుదలకు రెడీ చేసి, కాస్త రెస్ట్ తీసుకుని, ఫిబ్రవరికి కానీ ఎన్టీఆర్ సినిమా మీదకు రాలేడు.
ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ అయితే రెడీగానే వుంది కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాలి. అది చేయాలంటే, హారిక హాసిని యూనిట్ కూడా ఫ్రీ కావాలి. ఆ యూనిట్ కూడా జనవరి చివరికే ఫ్రీ అవుతుంది. అందువల్ల ఫిబ్రవరి అంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి, మార్చి నుంచి సెట్ మీదకు వెళ్తారు ఎన్టీఆర్-త్రివిక్రమ్ అని తెలుస్తోంది.
ఇదిలా వుంటే అవకాశం వుంటే, డిసెంబర్ నుంచి మార్చి అంటే నాలుగు నెలల్లో ఓ సినిమా చేద్దామా? అన్న ఆలోచన నిర్మాత దిల్ రాజుకు వున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దానికి ఎన్టీఆర్ అంత సుముఖంగా లేరని తెలుస్తోంది.