ఓ అమ్మాయి, గోడదూకి, ఇంట్లోకి ప్రవేశించి, రాత్రంతా వరండాలో, చలిలో నిద్రపోయి, తెల్లారి లేచి, ఎందుకు వచ్చావంటే, ఇంట్లో వున్న హీరోను పెళ్లి చేసుకోవడం కోసం అంటే, ఏమనుకోవాలి..పిచ్చండీ..దీన్ని పిచ్చి అంటారు అని చెప్పాలి ధర్మవరపు సుబ్రహ్మణ్యం స్టయిల్ లో.
హీరో నితిన్ ఇంట్లో ఈ సంఘటన గడచిన రాత్రి జరిగింది. పైగా ఆ అమ్మాయి ఓ పోలీస్ ఆఫీసర్ కూతురట. మన మీడియా మహా ఉదారమైంది కదా..పెద్దవాళ్లు అంటే పేర్లు బయటపెట్టదు. అదే చిన్నవాళ్లయితే ఫలానా ఊరు, ఫలానా గ్రామానికి చెందిన పుల్లయ్య, యల్లయ్య కూతురు అంటూ టముకేస్తుంది.
పోలీసులు తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపేసారు. అవును ఇంతకీ..రాత్రంతా కూతురు కనిపించకుంటే ఆ తల్లితండ్రులు ఏం చేసినట్లో? పిల్లలు ఇంతలా సినిమా స్టార్లకు అభిమానులుగా మారడం అంటే, ఈ హైటెక్ కాలంలో కూడా ఇలాంటి పిచ్చి అభిమానాలు పెంచుకోవడం అంటే ఏమనుకోవాలి.
అయినా ఓ అమ్మాయిది ఏముంది..మహా మహా సాప్ట్ వేర్ ఇంజనీర్లే సినిమా స్టార్ల పిచ్చితో కిందామీదా అయిపోతుంటే. తమ తమ స్టార్లను గుడ్డిగా నమ్మేసి, మద్దతిస్తుంటే..ఓ అమ్మాయి అనగా ఎంత?