ఉగ్రవాద బాటపట్టే యువత ఎవరు? అని అంటే.. ఇంతకు ముందు అంతా సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకలు ఒక రకమైన సమాధానం ఇచ్చే వాళ్లు. సమాజంలో నిరాదరణకు గురైన, చదువు లేని, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న స్థితిలో గ్రామీణ యువకులు ఉగ్రవాదం బాటన పడుతున్నారని, దాని బారిన పడుతున్నారని వారు చెప్పే వాళ్లు. మూలల నుంచి అభివృద్ధి సాధించినప్పుడు మాత్రమే యువకులు ఉగ్రవాద బాట పట్టరని.. వారికంటూ జీవితంపై కొత్త ఆశలూ, ఆశయాలు మొదలయితే ఉగ్రవాదులకు సైన్యం సమకూరదని విశ్లేషించేవాళ్లు.
అయితే ఈ విశ్లేషణలూ అన్నీ ఉత్తుత్తివే అనుకోవాల్సి వస్తోందిప్పుడు. ప్రత్యేకించి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియాకు మద్దతునిస్తున్న భారతీయ యువకులను పరిశీలించి చూస్తే ఒక అంశం స్పష్టం అవుతోంది.
ఈ సంస్థకు మద్దతుగా ట్విటర్ అకౌంట్ నిర్వహిస్తూ ఇటీవల పోలీసులకు దొరికిన యువకుడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు. సంవత్సరానికి ఐదులక్షల రూపాయల వరకూ జీతం కూడా వస్తోందతడికి. అయినా.. మతం అతడిని ఐఎస్ కు ఫ్యాన్ గా మార్చింది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం కన్నా ఉగ్రవాద దారిలో నడవడమే గొప్ప అని అతడు భావించాడు.
ఇక సిరియాకు ప్రయాణం అవుతూ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ మరో వ్యక్తిని పరిశీలిస్తే ఇతడు అమెరికాలో ఎమ్ ఎస్ చదివాడట! మరి ఆ మాత్రం చదువు ఉన్న వ్యక్తికి ఎన్ని అవకాశాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు అందంగా తీర్చిదిద్దుకొంటే జీవితంలో ఎక్కడి వరకూ ఎదగవచ్చునో వివరించనక్కర్లేదు.
అయితే ఇతడిదీ ఉగ్రవాద బాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. అర్థిక, సామాజిక స్థితిలో వెనుకబడిన వారు.. ప్రత్యేకంగా వ్యక్తిగతంతో తమకు జరిగన నష్టంతో ఏదో కసి తో రగులుతున్న వారు టెర్రరిస్టు సంస్థలతో చేతులు కలపడం సంగతి ఎలా ఉన్నా.. ఇలాంటి రీజన్లేమీ లేని వారు కూడా అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో చేరిపోతున్నారు. వినాశనాన్ని సృష్టించడానికి పోటీ పడుతున్నారు. ఇలా అన్నీ ఉన్నా.. ఉగ్రవాదం జోలికి వెళుతున్నారు.. దాని మద్దతు దారులుగా నిలుస్తున్నారంటే.. వీరిది మత మౌడ్యం అనే అనుకోవాలి!