సినిమా పరిశ్రమ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది రాను రాను. మొన్నటికి మొన్న బాలీవుడ్ సినిమా లీక్ అయితే వంద కోట్లు హామ్ ఫట్. కబాలీ లాంటి భారీ సినిమా విడుదలకు ముందే కోర్టుకు వెళ్లి మరీ, పైరసీని అరికట్టాలని కిందామీదా పడ్డారు. కానీ ఏం లాభం, సినిమా తొలి షో ముగిసిన కాస్సేపటికే నెట్ లోకి వచ్చేసింది.
అందుకోసం టొరంటో, డౌన్ లోడ్ ఇలాంటి లేకుండా డైరక్ట్ గా బ్రౌజింగ్ లింక్ లే వాట్స్ అప్, ట్విట్టర్, ఫేస్ బుక్ ల్లో సర్క్యులేట్ అయిపోయాయి. మరింక నిర్మాత, లేదా బయ్యర్ల పరిస్థితి ఏమిటి? అసలే సినిమా పరిస్థితి అంతంత మాత్రం, ఈ మూడు రోజులు అడ్వాన్స్ బుకింగ్ ల సంగతి సరే, టికెట్ లు దొరకక సోమవారానికి వాయిదా వేసుకున్నవారు, ఇప్పుడు ఈ పైరసీ లింక్ లు దొరకబుచ్చుకుంటే, ఇక అంతే సంగతులు.
టెక్నాలజీ పెరిగిన తరవాత పైరసీ ఆట కట్టించవచ్చు అనుకుంటే, డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తరువాత పైరసీని అరికట్టడం మరింత కష్టమవుతోంది. పైగా సర్క్యులేట్ కావడం మరింత సులభం, వేగం అయిపోయింది. అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో ఒక్కరికి దొరికితే చాలు, అమలాపురానికో, ఆచంటకో అరనిమిషంలో చేరిపోతోంది. ఇలా అయితే ఇక భారీ సినిమాలకు కూడా కష్టమే.