పంజాబ్ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగబోతున్నాయనగా నవజ్యోత్ సిద్దూ బిజెపి నుంచి రాజీనామా చేశాడు. అతని భార్య కూడా. 2014 పార్లమెంటు ఎన్నికలలో అరుణ్ జైట్లీ కోసం పంజాబ్‌లోని తన నియోజకవర్గం వదులుకోవలసి వచ్చిన దగ్గర్నుంచి అతను కాస్త రుసరుసలాడుతున్నాడు. పార్టీ వారు రాజ్యసభ ఎంపీ పదవి యిచ్చి వూరుకోబెట్టారు. ఇప్పుడు దాన్ని కూడా వదులుకున్నాడు. రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నానని ఏమీ అనలేదు. ఆప్‌లో చేరతాడనే పుకార్లు వస్తున్నాయి. ఇంకా ఏమీ స్పష్టం కాలేదు. పంజాబ్ రాజకీయాల్లో చాలాకాలంగా వున్న సిద్దూ ఆప్ వైపు మొగ్గు చూపాడంటే దాని అర్థం – అక్కడ ఆప్ హవా గట్టిగా వీస్తోందని అతని నమ్మకం అన్నమాట. సి-ఓటర్-హఫ్‌పోస్ట్ నిర్వహించిన సర్వే మొత్తం 117 సీట్లలో ఆప్‌కు 94-100 వస్తాయని చెప్పింది. దాన్ని ప్రముఖంగా హోర్డర్లపై చూపుతూ ఆప్ ప్రచారం చేసుకుంటూ ప్రత్యర్థుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీస్తోంది. ఎన్నికలు జరిగేలోగా పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో సిద్దూ ఆప్‌లోకి – ఒకవేళ వస్తూంటే – ఎందుకు వస్తూన్నట్లు?
పంజాబ్‌లోని అకాలీదళ్-బిజెపి సంయుక్త ప్రభుత్వం తొమ్మిదేళ్ల పైచిలుకుగా పంజాబ్‌ను ఏలుతోంది. మామూలుగానే అంతకాలం పాలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత రావడం సహజం. పైగా యీ ప్రభుత్వపాలన అధ్వాన్నంగా వుంది. తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో చిన్న రాష్ట్రాలైతే పాలన బాగుంటుందని వాదించడానికి మాటిమాటికి పంజాబ్, హరియాణాలను ఉదాహరణలుగా చూపించేవారు – వాటికి వున్న ప్రకృతి వనరులు యిక్కడ లేవని గ్రహించకుండా. అక్కడ అన్నీ వున్నా పాలన బాగా లేకపోవడం చేతనే హరియాణాలో ప్రభుత్వం మారింది, యిప్పుడు పంజాబ్‌లో కూడా మారే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే అనేక రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ ఋణం 60 వేల కోట్లు దాటింది. పంటలు దెబ్బ తిని, అప్పులు పెరిగి ప్రతీనెలా 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాగుడుతో, మాదకద్రవ్యాల వాడకంతో యువత పూర్తిగా భ్రష్టు పట్టిపోయారు. నిరుద్యోగం వారిని కృంగదీస్తోంది. ఇవన్నీ చూసి మహిళా ఓటర్లు ప్రభుత్వం పేరు చెపితేనే మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబసభ్యులు కాబినెట్‌నే కాదు, ఎస్‌జిపిసి (శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ)ని పూర్తిగా ఆక్రమించారు. కానీ అధికార పార్టీపై వున్న విముఖతను సొమ్ము చేసుకునే సామర్థ్యం కాంగ్రెసులో కనబడటం లేదు. దానికి నాయకుడిగా పాత మొహం అమరీందర్ సింగే కనబడుతున్నాడు. కాంగ్రెసు స్థానంలో ఆప్ ప్రతిపక్షంగా అవతరించి బిజెపి-అకాలీదళ్ కూటమిని ఓడించడానికి ప్రయత్నిస్తోంది. చాలాకాలంగా వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని క్రమేపీ విస్తరిస్తోంది. కాంగ్రెసు, అకాలీదళ్‌లకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బాగా వున్నారు. వ్యవసాయం దెబ్బ తినడంతో రైతులు అకాలీ దళ్‌పై కత్తి కట్టారు. అలా అని కాంగ్రెసు ఓటేయడానికీ వారు సిద్ధంగా లేరు. ''ప్రస్తుతం వున్న ప్రభుత్వం, కాంగ్రెసు ప్రభుత్వం రెండో దొందుకు దొందే. ఆప్ సంగతి ఎలా వుంటుందో చూడాలి మరి.'' అంటున్నారు పంజాబ్ రైతులు. మార్కెట్లోకి కొత్త వస్తువు వస్తే దాన్ని వాడిచూడడంలో పంజాబీలు ప్రథములు. మోజు తగ్గితే, దాన్ని పక్కకు పడేయడంలో కూడా వాళ్లదే అగ్రస్థానం. 2014లో నలుగురు ఆప్ ఎంపీలను నెగ్గించి చూశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆప్‌కో ఛాన్సిచ్చి చూస్తారేమోననే భయం పాత పార్టీల కుంది.
ఢిల్లీకి పొరుగునే వున్న పంజాబ్‌పై ఢిల్లీలో ఆప్ పాలన ప్రభావం గతంలోనే పడింది. అందుకే అక్కడ 4గురు ఆప్ ఎంపీలు నెగ్గారు. అయితే వారిలో యిద్దరు పార్టీ వీడిపోయారు. ఈ 17 నెలల్లో ఆప్ పాలనపై ఇండియా టుడే సర్వే చేసి కొన్ని గణాంకాలు యిచ్చింది. వారి సర్వే ప్రకారం ఢిల్లీలో అవినీతి 51% తగ్గింది. 400 యూనిట్ల కంటె తక్కువ విద్యుత్ వాడేవారికి 50% సబ్సిడీ యివ్వడానికి ఆప్ రూ.1600 కోట్లు బజెట్‌లో ఎలాట్ చేసింది. అది ప్రజలకు నచ్చింది కానీ డిస్కమ్‌లతో పోట్లాట, విద్యుత్ కోతలు మాత్రం వారిని వేధిస్తున్నాయి. ప్రతి యింటికి నెలకు 20 వేల లీటర్ల నీళ్లు ఉచితంగా యిస్తున్నారు. అలా సబ్సిడీ యిచ్చినా ఢిల్లీ జల్ బోర్డుకు గత సంవత్సరం కంటె రూ.178 కోట్ల ఆదాయం వచ్చిందని ఆప్ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరచడానికి ఆప్ తన బజెట్‌లో 23%, అంటే రూ.10,690 కోట్లు కేటాయించింది. సమ్మర్ క్యాంపులు పెట్టి ఆరో తరగతిలోకి చేరే కుర్రాళ్లకై తర్ఫీదు యిస్తోంది. అన్ని రాష్ట్రాలలో ప్రాథమిక వైద్యకేంద్రాలను (పిఎచ్‌సి)లను బలహీనపరచి కార్పోరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారు. కానీ ఆప్ ఏడాది చివరి కల్లా 1000 మొహల్లా (కాలనీ) క్లినిక్కులు పెడతానంటోంది. ఇప్పటికే అద్దె యిళ్లల్లో 21 తెరిచారు. అవి ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏడాదిలో వెయ్యి తెరవడం మాత్రం సాధ్యపడదని అంచనా. రోడ్లను బాగు చేయడానికి, పబ్లిక్ ట్రాన్సుపోర్టు మెరుగు పరచడానికి రూ. 5 వేల కోట్లు కేటాయించారు కానీ ఆ పని సవ్యంగా సాగలేదు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి సరి-బేసి పద్ధతి మొదటి దశ ప్రజాదరణ పొందింది. రెండో దశ అంత గొప్పగా విజయవంతం కాలేదు. పైగా చిత్రంగా కాలుష్యం 23% పెరిగింది. ఏది ఏమైనా ఏ రాష్ట్రప్రభుత్వం తలపెట్టని పథకం అమలుచేసి పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన పెరిగేట్లు చేసిన ఘనత ఆప్‌దే! ఇవన్నీ పంజాబ్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
ఓటర్లలో 30% వున్న యువతను ఆకట్టుకోవడానికి ఆప్ చాలా ప్రయత్నాలే చేస్తోంది. అధికారానికి వచ్చిన ఒక నెలలో మాదకద్రవ్యాల సరఫరా ఆపించేస్తానంది. ఆర్నెలల్లో వాటికి అలవాటు పడినవారిని సంస్కరిస్తానంది. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంది. ఇవన్నీ చూడడానికి ముందే ఆప్‌లోంచి బయటకు వచ్చేసి స్వరాజ్ అభియాన్ పెట్టిన యోగేంద్ర యాదవ్ ''ఏ రాజకీయ పార్టీల ధోరణిని నిరసిస్తూ ఆప్ ప్రభవించిందో, యిప్పుడు అవే పార్టీలకు నకలుగా మారింది.'' అన్నాడు. ఆప్‌లోంచి బయటకు వచ్చేసిన మేధావులు ఎందరు దుయ్యబట్టినా ఆప్‌కు పంజాబ్‌లో బలం పెరుగుతోంది. నిజానికి బిజెపి, ఆప్ రెండూ మధ్యతరగతివారికి, చదువుకున్నవారికి నచ్చే పార్టీలే. ఒకే ఓటు బ్యాంకు కోసం రెండూ పోటీ పడుతున్నాయి. అందుకే ఆప్ బిజెపిపై అస్త్రాలు ఎక్కుపెడుతోంది. ఆప్ ఎంపీ ఒకతను మాట్లాడుతూ ''మోదీగారు మన మాట వినడు, ఆయన మాటే మనం వినాలంటాడు. అందుకే ''మన్ కీ బాత్'' పేర ఆయన వూహలేమిటో మనకు చెప్తాడు. అరవిందయితే మనం చెప్పేది వింటాడు. అందుకే ఆయన ప్రోగ్రాం పేరు ''టాక్ టు ఎకె'', లిజన్ టు ఎకె కాదు.'' అని చమత్కరించాడు. పంజాబ్ జనాభాలో 32% దళితులే. దోఆబా బెల్ట్‌లో వున్న నాలుగు జిల్లాలలో దళితులు అధిక సంఖ్యలో వున్నారు. వారు బియస్‌పిని ఆదరిస్తూ వచ్చారు. కానీ బియస్‌పి నుంచి వాళ్లు కాంగ్రెసుకు మారవచ్చని అంటున్నారు. దళితుల కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తే ఆప్‌కీ ఛాన్సుండవచ్చుట.
పంజాబ్‌లో ఆప్‌ను అడ్డుకునే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారంటేనే ఆప్‌ను చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారని అర్థమవుతోంది. ముస్లిములు అధిక సంఖ్యలో వున్న మాలేర్‌కోట్లా గ్రామంలో జూన్ 24న ఒక స్మశానం బయట చిరిగిపోయిన కురాన్ పేజీలు కనబడ్డాయి. వెంటనే అల్లర్లు జరిగాయి. గత ఏడాది నవంబరులో వేరే వూళ్లో భగవద్గీత నుంచి చింపిన పేజీలు కనబడ్డాయి. దానికి నెల క్రితం మరో వూళ్లో గురు గ్రంథసాహెబ్ పేజీలు కనబడ్డాయి. ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చడానికి, కావాలని మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. కురాన్ పేజీలు చింపించాడని ఆప్ ఢిల్లీ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ మీద కేసు పెట్టారు. నేనే చింపానంటూ ముందుకు వచ్చిన విజయ్‌కుమార్ గర్గ్ అనే కార్యకర్త యాదవ్ చెప్పడం బట్టే అలా చేశానని చెప్పి యాదవ్‌ను యిరికించాడు. దానికి వీడియో లేదా ఆడియో సాక్ష్యం యింకా ఏమీ దొరకలేదు. ''జూన్ 26 న గర్గ్‌ను అరెస్టు చేయగానే అతను విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త అన్నారు. అప్పణ్నుంచి జులై 1 వరకు అతను విశ్వహిందూ పరిషత్ కార్యకర్తే. జులై 2 న హఠాత్తుగా అతన్ని ఆప్ కార్యకర్త చేసేశారు.'' అని వెక్కిరించాడు అరవింద్. ఇవన్నీ అబద్ధపు ఆరోపణలని కొట్టేసినా, ఒక విషయంలో మాత్రం క్షమాపణ చెప్పుకున్నాడు. జులై 3 న ఆప్ తరఫున యువతకై తయారుచేసిన మ్యానిఫెస్టో విడుదల చేశారు. దాని ముఖచిత్రంపై స్వర్ణమందిరం బొమ్మ వేసి, ఓ పక్కన ఆప్ ఎన్నికల గుర్తయిన చీపురు బొమ్మ కూడా వేశారు. దాంతో శిఖ్కుల స్వర్ణమందిరానికి అవమానం జరిగిందని విమర్శలు వచ్చాయి. అరవింద్ 'తెలియక చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటున్నా, ప్రాయశ్చిత్తంగా పంజాబ్ వచ్చి ఆ మందిరంలోని పాకశాలలో గిన్నెలు తోముతా' అన్నాడు. తోమాడు. ఇటువంటి సేవ ద్వారా పశ్చాత్తాపం వెల్లడించడం శిఖ్కు మతంలో పరిపాటే. ఆ తర్వాత మాలేర్‌కోట్లాకి వెళ్లి అక్కడ ముస్లిం మతస్తులతో కలిసి ఇఫ్తార్ విందు తిన్నాడు. ఢిల్లీలో పదవిని తన సహచరులకు వదిలి పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అరవింద్ కోరిక అని కొందరు రాస్తున్నారు.
అరవింద్‌కు ఢిల్లీని ఏలాలనే కోరిక తగ్గడంలో ఆశ్చర్యం లేదు. మోదీ అతనిపై పగబట్టాడు. రకరకాలుగా దిగ్బంధం చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. లెఫ్ట్‌నెంట్ గవర్నరు ద్వారా సతాయింపు కు తోడు మంత్రులపై, ఎమ్మెల్యేలపై చిన్నదో, చితకదో కేసు బనాయించడం, అవినీతిపై పోరాటమే తమ లక్ష్యం అని చెప్పుకునే ఆప్‌ని యిరకాటంలో పెట్టడానికి అరవింద్ ప్రిన్సిపల్ సెక్రటరీపై వున్న రూ. 50 కోట్ల అవినీతికి సంబంధించిన తొమ్మిదేళ్ల నాటి పాత కేసు తిరగతోడి అరవింద్ పంజాబ్ పర్యటనలో వుండగా అరెస్టు చేయించడం, ఢిల్లీ అసెంబ్లీ పాస్ చేసిన 14 బిల్లులను గంపగుత్తగా తిరస్కరించడం – యిలా ఎన్నో వున్నాయి. అరవింద్ కూడా తక్కువ తినలేదు. చెవిలో జోరీగలా తగులుకుని, మోదీని, బిజెపిని సందు దొరికినప్పుడల్లా ఘాటుగా విమర్శిస్తున్నాడు. బిజెపిని యిబ్బంది పెట్టే ఏ అవకాశాన్నీ – తనకు సంబంధం వున్నా లేకపోయినా – వదులుకోవటం లేదు. ఈ తగవుల వలన ఢిల్లీ ప్రజలకు అరవింద్ యిచ్చిన హామీలు పెద్దగా అమలు కావటం లేదు. ఐదేళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలకు సమాధానం చెప్పుకోవడం అరవింద్‌కు కష్టమే. అరవింద్‌లో ఓ పేచీకోరు కనబడుతున్నాడే తప్ప పాలనాసమర్థుడు కనబడటం లేదు. తన సామర్థ్యాన్ని చూపుకోవడానికి అరవింద్‌కు ఏదైనా ఒక రాష్ట్రం కావాలి. అది పంజాబ్ ఎందుకు కాకూడదు అని అతను తలపోయడంలో ఆశ్చర్యం లేదు. అయితే అరవింద్ హరియాణాకు చెందినవాడు. అనేక సరిహద్దు తగాదాలు వుండడం చేత పంజాబీలు హరియాణా వారిని నమ్మరు. తను హరియాణాకు మేలు చేస్తాడన్న అనుమానంతో పంజాబ్ ప్రజలు ఆప్‌ను ఆదరించకపోయే ప్రమాదం వుందని అరవింద్‌కు భయం వుంది. తను సిఎం అభ్యర్థిగా నిలబడితే లాభం లేదన్న మాట నిజమే కానీ పంజాబ్‌లో ఆప్ తరఫున పెద్ద లీడరు ఎవరూ లేరు. ఈ సమస్యను అధిగమించడానికే సిద్దూను ఆప్‌లోకి ఆహ్వానించి వుంటాడని అనుకోవడానికి ఆస్కారం వుంది. క్రికెటర్‌గా, టీవీ హోస్టుగా, చాలా సంవత్సరాలుగా ప్రజా నాయకుడిగా సిద్దూకి ఒక యిమేజి వుంది. పైగా అతను పంజాబీ సిఖ్కు. ఆప్ మద్దతు తోడవుతే అతను గట్టి పోటీ యివ్వగలడు. అందుకే బిజెపి యిచ్చిన ఎంపీ పదవి కూడా వదిలేసి రంగంలోకి దిగుతున్నాడు. ఈ ఊహ నిజమో కాదో కొద్ది వారాల్లోనే తేలిపోతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)