కెరీర్లో ‘ల్యాండ్ మార్క్’ అనదగ్గ చిత్రాలు కొన్ని వుంటాయి నటీనటులకి. హీరోల విషయంలో ‘టాప్ 10’ అనే మాట ప్రముఖంగా విన్పిస్తుంటుంది. మేటి హీరోలు ‘టాప్ 10’ అని కొన్ని సినిమాల గురించి చెబుతుంటారు. తమ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు, తమను స్టార్స్‌ని చేసిన సినిమాలు అందులో చోటు దక్కించుకుంటాయి.
కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్ పరిస్థితి వేరు. ఆయన ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఒకటి వుంది. నిన్న మొన్నటిదాకా అయితే అది ‘బాబా’ సినిమా. కానీ ఇప్పుడు అది కాదు. ఎప్పటికీ రజనీకాంత్ మర్చిపోలేని సినిమా ‘లింగ’. తెలుగు, తమిళ భాషల్లో ‘లింగ’ సినిమా తీవ్రమైన నష్టాల్ని చవిచూసింది. రజనీకాంత్‌కి హిట్స్, ఫ్లాప్స్ కొత్త కాదు. ‘బాబా’ కూడా పెద్ద పరాజయమే చవిచూసింది. కానీ, ‘లింగ’ పెద్ద ఫ్లాప్ కావడంతోపాటు, రజనీకాంత్‌ని రోడ్డుకీడ్చేసింది వివాదాలతో.
రజనీకాంత్ ఓ సూపర్ స్టార్.. రజనీకాంత్ ఓ స్టయిల్ ఐకాన్.. రజనీకాంత్ ఓ బ్రాండ్. అలాంటి రజనీకాంత్‌కి మచ్చ తెచ్చిన సినిమాగా ‘లింగ’ రికార్డులకెక్కిందనడం అతిశయోక్తి కాదేమో. రజనీకాంత్‌కి వ్యతిరేకంగా డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్షలు చేపట్టారు. నిర్మాత ఈ సినిమా ద్వారా చవిచూసిన నష్టం కన్నా, వివాదాలతో మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడ్డాడు.
ప్రస్తుతానికి సినిమా వివాదం ఓ కొలిక్కి వచ్చింది. నష్టంలో పది కోట్లు తిరిగిచ్చేందుకు నిర్మాత సిద్ధపడ్డాడు. దాంతో ఇప్పటికి ‘ఇంటర్వెల్’ పడింది. పూర్తిగా వివాదం సద్దుమణిగిందనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే, వివాదం వెనుక ఏవేవో అదృశ్యశక్తులు నిలబడి, డిస్ట్రిబ్యూటర్లను ఉసిగొల్పుతున్నారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది గనుక. అదే నిజమైతే, ‘లింగ’ మరోమారు రజనీకాంత్‌కీ, నిర్మాతకీ చుక్కలు చూపించడం ఖాయమే.