తెలుగు నాట ఓ సంప్రదాయం ఉంది. బడా హీరోల్ని 'బాబూ… 'అంటూ పిలవాల్సిందే. చరణ్ బాబు, కల్యాణ్ బాబు… అంటూ మెగా హీరోల్ని పిలుస్తుంటారు. మహేష్ ఎలాగూ బాబు కాబట్టి… ఎలాంటి ప్రాబ్లం లేదు. వెంకటేష్ కూడా వెంకటేష్ బాబే! మనోజ్ బాబు, విష్ణు బాబు ఉండనే ఉన్నారు. ఇప్పుడు కొత్త హీరోలూ 'బాబు'లైపోతున్నారు.
నువ్విలా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు హవీష్. ఆ తరవాత జీనియస్ సినిమా చేశాడు. అది పోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నంగా 'రామ్ లీలా' రూపొందించారు. ఈ సినిమా హవీష్ సొంత నిర్మాణ సంస్థలోనే రూపొందించారు. శనివారం హైదరాబాద్‌లోని తాజ్ డక్కన్‌లో ఆడియో కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో హవీష్‌ని అందరూ 'హవీష్ బాబూ. హవీష్ బాబూ' అంటూ పిలవడం మొదలెట్టారు. దాంతో టాలీవుడ్‌లో మరో బాబు వచ్చి చేరిపోయాడన్నమాట. అంతేనా.. కొత్త కుర్రాడు నాగశౌర్యని కూడా బాబు అనే పిలవాటల. ఈ బాబుల డాబు చూళ్లేక ఛస్తున్నాం బాబూ…