ఏ డైరక్టర్ కు అయినా మాంచి క్రౌడ్ పుల్లింగ్ వున్న హీరోతో సినిమా చేయాలనే వుంటుంది. కానీ అందరి కోరికలు తీరాలి కదా? ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు సినిమా చేస్తున్న డైరక్టర్ మారుతికి గీత గోవిందం సినిమా విజయం చూసాక, విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని తెగ కోరిక పుట్టింది. పైగా తరువాత సినిమాకు నిర్మాతలు రెడీగా వున్నారు. గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిపి ఆ సినిమా నిర్మిస్తారు. అలాంటి బ్యానర్లు అడిగితే విజయ్ కాదనడు అన్న నమ్మకం.
కానీ ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి. ఒకటి మారుతి దగ్గర సబ్జెక్ట్ రెడీగా లేదు. రెండవది విజయ్ దేవరకొండ ఖాళీగా లేడు. చేస్తున్నవి రెండు సినిమాలు కాకుండా, చేయాల్సినవి మూడు సినిమాలు వున్నాయి. అవి లైన్లో చేసి తీరాల్సిందే. ఆ తరువాత యువికి, గీతాకు సినిమా చేయడం అన్నది. ఆ మాటకు వస్తే హారిక హాసిని వారి అడ్వాన్స్ కూడా ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ దగ్గర వుంది.
కమిట్ మెంట్లు అన్నీ పూర్తిచేసి రావాలంటే 2019 దాటేస్తుంది. అది పక్కా. మరి అంతవరకు మారుతి ఖాళీగా కూర్చుంటారా? లేక గీతా సంస్థ కోసం సాయిధరమ్ తేజతో సినిమా చేస్తారా? వాస్తవానికి సాయిధరమ్ తేజ్ తో సినిమా అన్నది అలా అలా వెనక్కు జరుపుకుంటూ వస్తున్నారు మారుతి. ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ అంటూ ఫీలర్లు వదులుతున్నారు అంటే, సాయిధరమ్ తో సినిమా చేయడం అంతగా ఇష్టంలేదనే అభిప్రాయం బయటకు వెళ్తుంది.
వాస్తవానికి మారుతి హీరో నానితో సినిమా చేసే వేళకు అతను పెద్ద హీరో కాదు. ఫ్లాపుల్లో వున్నాడు. శర్వానంద్ తో సినిమా చేసాడు అంటే అది యువి క్రియేషన్స్ తో ఆ హీరోకు వున్న బంధం. కానీ ఇక్కడ ఇప్పుడు విజయ్ సూపర్ స్టార్ అయిపోతున్నాడు. అందువల్ల మారుతికి అంత సులువుగా డేట్ లు దొరుకుతాయా? అంటే అనుమానమే.
అయినా ఇవన్నీ శైలజారెడ్డి అల్లుడు ఫలితం తరువాత. అప్పటి పరిస్థితులు, ఆ సినిమా హిట్ రేంజ్ ఇవన్నీ కలిసి, మారుతి తయారుచేసే స్క్రిప్ట్ మీద ఆధారపడి వుంటుంది తరువాత సినిమా అన్నది. అప్పటి వరకు అన్నీ ఊహాగానాలే.