మారుతి మాటే నెగ్గింది?

శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఓవర్ సీస్ హక్కుల విషయంలో మొత్తానికి దర్శకుడు మారుతి మాటకే నిర్మాతలు ఊ అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను తన మిత్రుడు ఐ డ్రీమ్ వాసుదేవ రెడ్డికి…

శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఓవర్ సీస్ హక్కుల విషయంలో మొత్తానికి దర్శకుడు మారుతి మాటకే నిర్మాతలు ఊ అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను తన మిత్రుడు ఐ డ్రీమ్ వాసుదేవ రెడ్డికి ఇవ్వాలన్నది మారుతి కోరిక. బయట వాళ్లకు ఇచ్చే రేటుకే ఐ డ్రీమ్ వాసుకు ఇవ్వమని అడుగుతూ వచ్చారు.

కానీ తమ బ్యానర్ పై రాబోయే మూడు సినిమాలు కలిపి ఒకే డిస్ట్రిబ్యూటర్ కు ఇవ్వాలన్నది హారిక హాసిని ఆలోచన. రెండు రోజుల క్రితమే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాను ఎల్ ఎ తెలుగు సంస్థకు ఇచ్చారు. దాంతో పాటే ఈ మిగిలిన రెండు సినిమాలను కూడా వారికే ఇవ్వాలని హారిక హాసిని అనుకున్నమాట వాస్తవం.

కానీ ఈ విషయంలో మారుతి పట్టు వీడలేదు. తమకు ఒక చోట ఒకే డిస్ట్రిబ్యూటర్ వుండాలని, తరచు బయ్యర్లను మార్చడం తమ పద్దతి కాదని హారిక హాసిని నిర్మాతలు భావిస్తున్నారు. ఆఖరికి మారుతి కోసం మనసు మార్చుకుని, ఐ డ్రీమ్ వాసుదేవ రెడ్డికి నాగచైతన్య శైలజ రెడ్డి అల్లుడు సినిమాను 3.10 కోట్లకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.