నాగ్ చైతన్య రెండు సినిమాలు సమాంతరంగా చేస్తున్నాడు. ఒకటి చందు మొండేటితో సవ్యసాచి. రెండవది మారుతి డైరక్షన్ లో శైలజరెడ్డి అల్లుడు. ఒకటి చైతన్యకు ఇష్టమైనది, అస్సలు ఇప్పటి వరకు అచ్చిరాని యాక్షన్ జోనర్. రెండవది ఫ్యామిలీ జోనర్. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు వస్తుందన్నది ఇప్పుడు పాయింట్.
వాస్తవానికి సవ్యసాచి ముందుగా మొదలయింది. దీన్ని మే 25కే విడుదల చేయాలని ముందు అనుకున్నారు. కానీ నాగ్-వర్మ ఆఫీసర్ వస్తుందని వాయిదా వేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే జూలైలో కూడా విడుదలయ్యేలా కనిపించడం లేదు. యూనిట్ అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ కు రావాలని అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అలా అనిపించడం లేదు.
సవ్యసాచి 75శాతం పూర్తయింది. శైలజరెడ్డి 50శాతం పూర్తయింది. కానీ సవ్యసాచికి కాస్త గట్టిగానే రీషూట్ లు అవసరం పడుతున్నాయని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అయితే శైలజరెడ్డి షూట్ మధ్యలో వుంది. నాగ్ చైతన్యతో రమ్యకృష్ణ కాంబినేషన్ డేట్ లు వున్నాయి కనుక, వాటిని క్యాన్సిల్ కొట్టడానికి లేదు. ఆ తరువాత సవ్యసాచి బ్యాలన్స్ వర్క్ పెట్టుకుంటే లేట్ అయిపోతుంది.
ఏదో కిందా మీదా పడి ఆగస్టు ఫస్ట్ వీక్ కు రెడీ చేసినా, శైలజ రెడ్డి విడుదల కు డేట్ ఫిక్స్ చేసుకుని రెడీ గా మారుతి. ఆగస్టు లాస్ట్ వీక్ లో. ఆయన తన సెంటి మెంట్ ల ప్రకారం ఆ ముహుర్తం మార్చడానికి వీలు లేదని ముందే మాట తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి రెండు వారాల గ్యాప్ లో చైతూ తన రెండు సినిమాల విడుదలలకు ఊ అంటారా? లేక సవ్యసాచిని వెనక్కు నెట్టి, శైలజరెడ్డి విడుదలకు ఓకె అంటారా? అన్నది అనుమానం.
సవ్యసాచి ని కూడా దసరా టైమ్ లో తీసుకువస్తే బెటర్ అన్న ఆలోచన కూడా ఒకటి వున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, సవ్యసాచికి కాస్త ఓవర్ బడ్జెట్ అయినట్లు వినికిడి. ఆ రేంజ్ రికవరీ కావాలంటే మాంచి సీజన్ వుండాలి. అందువల్ల మరి సవ్యసాచి యూనిట్ ఆ దిశగా ఏమన్నా ఆలోచిస్తుందేమో? చూడాలి.