సరైన సినిమాలు పడక, సరైన లైనప్ లేక ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ. ఇప్పడిప్పుడే కుదరుకుంటున్నారు. జవాన్ సినిమా చేసాడు కానీ, వినిపిస్తున్న వార్తల ప్రకారం దానిపై మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు. దిల్ రాజు లక్ కలిసి రావాలంతే ఆ సినిమాకు. ప్రస్తుతం వివి వినాయక్ తో సినిమా చేస్తున్నాడు.
ఆకుల శివ మాంచి రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అందించాడని వినికిడి. ఆ సినిమా తరువాతి సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడు. వరుస హిట్ లు అందిస్తున్న మారుతి డైరక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ ఆ సినిమా వుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే వివి వినాయక్ సినిమా ఇప్పటికే జోరుగా నిర్మాణం జరుపుకుంటోంది. మారుతి నవంబర్, డిసెంబర్ ల్లో కానీ నాగ చైతన్య సిన్మా స్టార్ట్ చేయరు. అది పూర్తయ్యేసరికి మార్చి, ఏప్రిల్ రావచ్చు. మరి వినాయక్ సినిమా అయిపోయిన తరువాత మారుతి కోసం వెయిట్ చేస్తాడా? లేదా ఆ గ్యాప్ లో ఎవరితో అయినా సినిమా ప్లాన్ చేస్తాడా? అన్నది మాత్రం చూడాలి.
మరో పక్క డైరక్టర్ మారుతి అయితే నాగ చైతన్య సినిమా చేసాకే మరే సినిమా అయినా అన్న ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇదిలా వుంటే తమకు వున్న మారుతి డేట్లను గీతా ఆర్ట్స్ మరో విధంగా వాడుకునే ఆలోచనలో కూడా వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరైన కథ దొరికితే మారుతితో భారీ సినిమా చేసే ఆలోచనలో గీతా ఆర్ట్స్ వున్నట్లు తెలుస్తోంది. మరి అప్పుడు సాయి ధరమ్ తేజ మరో డైరక్టర్ కోసం వెదుక్కోవాలేమో?