దాదాపు ఒకేసారి బుల్లితెరపైకి వచ్చారు కమల్ హాసన్, ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా ఇద్దరూ ఒకే రియాలిటీ షో చేశారు. తమిళ బిగ్ బాస్ కు కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. తెలుగులో బిగ్ బాస్ ను ఎన్టీఆర్ రక్తికట్టించాడు. ఫస్ట్ టైం అయినా ఇద్దరూ తమ టాలెంట్ తో షో ను సూపర్ హిట్ చేశారు.
మరి బిగ్ బాస్ సీజన్-2 పరిస్థితేంటి..? సెకెండ్ సీజన్ కు కూడా వీళ్లే కంటిన్యూ అవుతారా? ప్రస్తుతం ఈ ప్రశ్న చుట్టూనే చాలా చర్చ నడుస్తోంది. తమిళనాట ఆల్రెడీ కమల్ కు ప్రత్యామ్నాయంగా సూర్య పేరు తెరపైకి వచ్చేసింది. తమిళ బిగ్ బాస్ సీజన్-2ను సూర్య హోస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి తెలుగు బిగ్ బాస్ సీజన్-2 సంగతేంటి?
తెలుగులో ప్రస్తుతానికి ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయంగా ఎవరూ కనిపించడం లేదు. తన ఎనర్జీతో షోకు ఓ కొత్త లుక్ తీసుకొచ్చాడు ఎన్టీఆర్. కాసేపు నవ్విస్తూ, ఇంకాసేపు హెచ్చరిస్తూ, మరికాసేపు భయపెడుతూ బిగ్ బాస్ ను సూపర్ డూపర్ హిట్ చేశాడు. కానీ సీజన్-2కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించాడు. స్టార్ మా నిర్వహకులు సీజన్-2కోసం ఎన్టీఆర్ నే కొనసాగిస్తారా లేక మరో స్టార్ హీరోను కలుస్తారా అనేది చూడాలి.
ఇక కమల్ విషయానికొస్తే అతడు చాలా బిజీ. విశ్వరూపం-2, శభాష్ నాయుడు సినిమాలు పూర్తిచేయాలి. ఆ వెంటనే శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2ను స్టార్ట్ చేయాలి. వీటితో పాటు పొలిటికల్ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లాలి. కమల్ అంత బిజీ కాదు ఎన్టీఆర్. చేస్తున్న సినిమాతో పాటు బిగ్ బాస్ ను బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది.
మరి.. సీజన్-2 చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా.. ఒకవేళ ఒప్పుకుంటే రెమ్యూనరేషన్ ఇంకాస్త పెంచుతాడా. ప్రస్తుతం ఈ రెండు ప్రశ్నలే బిగ్ బాస్ చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు సీజన్-2 కోసం పూణెకు వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఓ భారీ విల్లాను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు స్టార్ మా వాళ్లు. సో.. ఈసారి ఎన్టీఆర్ కు పని మరింత ఈజీ అయిపోతుంది. ఎటొచ్చి మరోసారి కాంట్రాక్ట్ కుదరడమే ఆలస్యం. సీజన్-1కు ఎన్టీఆర్ కు అటుఇటుగా 8కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందింది.