రామ్ గోపాల్ వర్మ సినిమా 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' హడావుడి పీక్ కు చేరుకుంది. ఈ సినిమా నవంబర్ నెలాఖరుకు విడుదలవుతోంది. ఈ సినిమా ఎలా వుంటుంది? ఆ సినిమా తరువాత ఆర్జీవీ ఏం చేస్తాడు అన్నది ఇప్పటికి ఇదమిద్దంగా తెలియదు. ఆర్జీవీ వ్యవహారం కూడా అలాగే వుంటుంది. ఆయన ఎప్పుడు ఏది అనౌన్స్ చేస్తాడో ఆయనకే తెలియదు.
ఇలా చటుక్కున అనౌన్స్ చేసి, సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేస్తారు. అంతలోనే విడుదల అంటారు. ఎప్పుడు తీస్తారో ఎవరికీ తెలియదు. అందువల్ల కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తరువాత వర్మ నుంచి ఏం రాబోతోంది అన్నది ఇంకా తెలియదు. కానీ ఓ చిన్న గ్యాసిప్ మాత్రం వినిపిస్తోంది.
'మట్టి ముంతలో మజ్జిగ అన్నం' అనే టైటిల్ లో సినిమా ఏదో అందిస్తారన్నది ఆ గ్యాసిప్. ఈ టైటిల్ వినగానే గుర్తుకు వచ్చేది జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఓ మూలన కూర్చుని చిన్న మట్టిపిడతలో మజ్జిగ అన్నం తినే సీన్. బహుశా ఆయన మీద ఏమైనా ఇలాంటి టైటిల్ లో సినిమా తీసే ఆలోచన వర్మలో వుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమాలో పవన్ స్టిల్స్ గుర్తుకు వచ్చే సీన్లు వుంటాయేమో? పశువులకు వర్షంలో అరటిపళ్లు తినిపిస్తూ ఫొటొలు తీయించుకుని వదలడం, కారు డిక్కీ దగ్గర కూర్చుని టీ తాగుతూ ఫొటో వదులడం, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన లేదా ఇంటి బయట కూర్చుని ఫొటొలు తీయించుకుని వదలడం, మడత కానీ, ఓ పేజీ కానీ నలగని పుసక్తాలకు ఫొటొలు తీసి వదలడం వంటి వ్యవహారాలు అన్నీ గుదిగుచ్చి సినిమా అందిస్తారేమో? అన్న టాక్ వినిపిస్తోంది.
వర్మ తీస్తారో?తీయరో? కానీ మట్టి పిడతలో మజ్జిగ అన్నం అనే టైటిల్ మాత్రం భలే క్యాచీగా వుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.