సినిమా జనాల ఫంక్షనుకు మీడియాను కూడా పిలవడం అన్నది ఓ డిఫాల్ట్ ఆనవాయతీ. అందుకోసం ఏమీ ఇన్విటేషన్లు ఇవ్వక్కరలేదు. ప్రత్యేకంగా పిలవనక్కరలేదు. జర్నలిస్టుల గ్రూప్ లో ఓ మెసేజ్ పడేస్తే పోయే. లేదూ అంటే పీఆర్వో చేత ఒక ఫోన్ కొట్టిస్తే సరిపోయే.
కానీ అలా అని వెళ్లే మీడియా జనాలను అక్కడ వచ్చారా? అని అడిగే వాడు వుండడు. పార్టీకి వచ్చిన ప్రతి వాళ్లు స్టేజ్ ఎక్కడి ఫంక్షన్ కు మూలమైన వారిని పలకరించి, ఓ ఫొటో దిగి వెళ్లి పోవచ్చు. కానీ మీడియా జనాలు మాత్రం కాస్త దూరంగా నిల్చుని ఈ తంతు చూస్తూ వుండాలి. ఎందుకంటే కవరేజ్ కావాలి కదా. లేదూ అంటే వచ్చి భోజనం కానిచ్చి వెళ్లిపోవాలి. అంతవరకే మీడియా ముచ్చట. మీడియా పిలుపు.
నిన్నటికి నిన్న చైతూ-సమంత పెళ్లి పార్టీలో కూడా కొందరు జర్నలిస్ట్ లు దగ్గరకు వెళ్దామనుకుంటే, అక్కడున జనాలు, మీడియానా.. మీదకు వెళ్లాలంటే పీఆర్వో వచ్చి చెప్పాలి. లేదంటే పంపమని పక్కకు వుంచారట. పిలుపు లేకుండా అక్కడి దాకా రారు, రాలేరు అని కూడా వారికి తెలియదేమో?
పెళ్లి రిసెప్షన్ లు అయితే ఇదీ తంతు. హీరోల పుట్టిన రోజు పార్టీలు అయితే మరీ ఘోరం. ఫలానా హీరో బర్త్ డే పార్టీ అంటూ మెసేజ్. తీరా వెళ్తే బర్త్ డే హీరో మాత్రం రాడు. వెళ్లిన వాళ్లు అతగాడి పేరు చెప్పుకుని, తినేసి రావడమే. ఖర్చు హీరోదే కావచ్చు.
కానీ మీడియా అంటే భోజనం పెట్టేసి పంపేయడమే అనుకుంటున్నారు తప్ప, పలకరించాలని అనుకోవడం లేదు. అందుకే హీరోలు తాము రాకుండానే పుట్టిన రోజు పార్టీలు ఇస్తున్నారు. హీరోలు తమ దగ్గరకు రాకుండానే పెళ్లి పార్టీ ఎంజాయ్ చేసి పొమ్మంటున్నారు.
మీడియా అంటేనే కరివేపాకు అన్నారు కదా.