Advertisement


Home > Movies - Movie Gossip
త్రివిక్రమ్ పై చినబాబు అసంతృప్తి?

హారిక హాసిని అంటే త్రివిక్రమ్.. తివిక్రమ్ అంటే హారిక హాసిని. అంత బంధం వారిది. హారిక హాసినిలో త్రివిక్రమ్ పెట్టుబడులు వున్నాయి, వర్కింగ్ పార్టనర్ లాంటి గుసగుసలు వున్నాయి. అవన్నీ వారికే తెలియాలి. కానీ ప్రస్తుతం మాత్రం హారిక హాసిని అధినేత చినబాబుకు మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ వర్కింగ్ స్టయిల్ అంతగా నచ్చడం లేదని గుసగుసలు పక్కాగా వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా విషయంలో త్రివిక్రమ్ వ్యవహారం ఆయనకు నచ్చడం లేదని వినికిడి.

ఓ సాదా సీదా 1980-90ల నాటి కథను తీసుకుని దాన్ని, ఈ ట్రెండ్ కు అనుగుణంగా మార్చే కొత్త స్కీమును త్రివిక్రమ్ తలకెత్తుకున్నట్లు వినికిడి. గతంలో అ..ఆ సినిమాను ఇలాగే ఆయన మార్చారు. విజయం సాధించారు. అజ్ఞాతవాసి కూడా అలాగే అని వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజం అన్నది సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.

కానీ ఈ లోగా సమస్య ఏమిటంటే, ఈ సినిమా బడ్జెట్, లెంగ్తీ షెడ్యూళ్లు, వాటికి అవుతున్న ఖర్చు అన్నది. నిజానికి ఈ సినిమాకు అంత భారీ సెట్లు, అంత గ్రాఫిక్స్ లేకుండా ఓ  రెగ్యులర్ భారీ కమర్షియల్ సినిమాలా కూడా తీయవచ్చని ఎప్పటి నుంచో గుసగుసలు వున్నాయి. అయినా త్రివిక్రమ్ ఆలోచన మేరకు భారీగానే వెళ్తున్నారు. కానీ అదే సమయంలో కాస్త వృధా ఖర్చు అవుతోందని చినబాబు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

ఆ మధ్య ఓ విదేశం వెళ్లి, బోలెడు ఖర్చు చేసి, తీరా, సరిగ్గా లేదని వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు వెళ్లిన యుకె షెడ్యూలుకు కూడా అయిదు కోట్లు ఖర్చు అని అంచనా వేసుకుంటే, ఎనిమిది కోట్లకు డేకుతోందని తెలుస్తోంది. భారీగా ఖర్చు చేస్తున్నా ఫరవాలేదు. భారీ రేట్లు అమ్మారు కాబట్టి. కానీ ఒకటే సమస్య.

భారీ రేట్లకు కొన్న బయ్యర్లు రేపు సినిమా విడుదలయ్యాక, రికవరీ కాకపోతే, పరిస్థితి ఏమిటన్నది ఆలోచిస్తే, ఆందోళనగా వుందని చినబాబు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ రేట్లుకు అమ్మడం లేదు. బాహుబలి వన్ రేంజ్ కన్నా కాస్త అటుగానే అమ్ముతున్నారు ఈ సినిమాను. ఖైదీ నెంబర్ 150 టోటల్ రన్ లో కలెక్ట్ చేసిన దానికి కాస్త అదనంగానే రేట్లు ఫిక్స్ చేసి విక్రయించారు.

అంటే ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కావాలన్నది లెక్కవేసుకోవచ్చు. ఎంత ఫ్లాట్ రేట్లు పెట్టి అమ్మేసినా, ఎంత ఎక్కువ షోలు వేసినా, సినిమా టాక్ ను బట్టే వుంటుంది. పవన్ సినిమాలు ఫ్లాప్ అంటేనే 50 నుంచి 60కోట్లు వసూళ్లు చేసాయన్న ధీమా వుంటే వుండొచ్చు. కానీ ఆ వసూళ్లు కూడా తొలి వారంలో ఇలా భారీ ఫ్లాట్ రేట్లు, భారీగా షోలు వేయడం బట్టే అని మరిచిపోరాదు. అందువల్ల భారీ హిట్ అయితే, దీనికి డబుల్ వస్తుంది అనుకున్నా 120కోట్ల వరకే. అదే ఇప్పుడు హారిక హాసిని యూనిట్ టెన్షన్ గా వుంది.

పోనీ నిర్మాణానికి అమ్మకానికి మధ్యలో మార్జిన్ బాగా వుంటే, సినిమా తేడా వచ్చినా కాస్త రిటర్న్ ఇవ్వచ్చు. కానీ అమ్మకాల మేరకు సినిమా కోసం ఖర్చు చేయించేస్తూ వుంటే అసంతృప్తి కాక ఏముంటుంది? అయితే త్రివిక్రమ్ ముందు హారిక హాసిని యూనిట్ మొత్తం ప్రిన్సిపాల్ ముందు స్కూలు పిల్లల మాదిరే. వినడమే తప్ప చెప్పేది వుండదు. అందుకే పాపం, చినబాబు తన సన్నిహితుల దగ్గర బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

అన్నీ రూమర్లే

ఇదిలా వుంటే హారిక హాసిని సంస్థ ఈ రూమర్లను ఖండించింది. ఇవన్నీ వట్టి గ్యాసిప్ లే అని, అజ్ఞాతవాసి సినిమా కోసం ఎక్కడా వృధా ఖర్చు కావడం లేదని చెబుతున్నారు. విదేశాల్లో పక్కా ప్లానింగ్ ప్రకారమే ఖర్చు అవుతోందని, వృధా ఏదీ లేదని అంటున్నారు. తమ పర్సనల్ రిలేషన్స్ దెబ్బతీయడానికి ఎవరో ఈ గ్యాసిప్ లు పుట్టించారని హారిక హాసిని జనాలు అంటున్నారు.