మీడియా నిషేధం.. వుండేనా? ఊడేనా?

బ్యాన్ (BAN). భరత్ అనే నేను విడుదలయింది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో బ్యాన్ విడుదల కాబోతోంది. ఈ బ్యాన్ అంటే న్యూస్ చానెళ్లపై నిషేధం. ఈ మేరకు ఈరోజు ప్రెస్ నోట్…

బ్యాన్ (BAN). భరత్ అనే నేను విడుదలయింది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో బ్యాన్ విడుదల కాబోతోంది. ఈ బ్యాన్ అంటే న్యూస్ చానెళ్లపై నిషేధం. ఈ మేరకు ఈరోజు ప్రెస్ నోట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సర్వ సన్నాహాలు జరుగుతున్నాయి. తొంభై తొమ్మిది శాతం ఈ రోజే విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఒక్కశాతం మాత్రం ఆ అవకాశం లేదని వినిపిస్తోంది. విడుదల ఆపడానికి కూడా అనేక యత్నాలు జరుగుతున్నాయి.

నిర్మాతలు రెండుగా చీలిపోయారని, బ్యాన్ లాంటి వ్యవహారం వద్దు అని ఆ వర్గం పట్టుబడుతోందని తెలుస్తోంది. అయితే హీరోలు మాత్రం కాస్త గట్టిగా పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఆ మధ్య ఓ ఛానెల్ తన బిజినెస్ ప్రోగామ్ లో కావాలని హీరోలపై కాస్త గట్టి కామెంట్లు చేసింది. ఈ వీడియో హీరోలను అఫెండ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే వారు గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే మీడియా పెద్దలు కొందరు నేరుగా సినిమా ఇండస్ట్రీ పెద్దలకు ఫోన్ చేసి, ఇలాంటి హడావుడి నిర్ణయం మంచిది కాదని హెచ్చరించినట్లు తెలిసింది. ప్రకటనలు ఇవ్వండి, మానేయండి.. అది మీ ఇష్టం.. కానీ నిషేధం అంత ఆరోగ్యకరంగా వుండదని చెప్పినట్లు తెలుస్తోంది.

శ్రీరెడ్డి సంఘటనకు సంబంధించి ఓ నిర్మాత కొడుకు పేరు బయటకు వచ్చినపుడు, ఆ నిర్మాత ఓ మీడియా హెడ్ తో మాట్లాడితే, ఆ కుర్రాడి పేరు తాము బయట పెట్టలేదని, ఆ మేరకు శ్రీరెడ్డి తమ మీద అలిగిందని, ఇలా తాము సహకారం అందిస్తే, తమనే బ్యాన్ చేయాలని అనుకుంటారా? ఇలా అయితే తామేంటో చూపిస్తామని అన్నట్లు తెలుస్తోంది.

మరోపక్క విడుదల కాబోయే ఓ సినిమాకు సంబంధించి కొన్ని చానెళ్లకు ప్రకటనలు ఇవ్వకపోయినా, ఆ మేరకు ప్యాకేజ్ అమౌంట్ లు నిర్మాత నేరుగా జమచేసేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ డిస్కషన్ల దృష్ట్యా ప్రకటనలు ఇవ్వలేమని, కానీ అందుకు సమానమైన మొత్తం చెల్లించేస్తామని, నెగిటివ్ చేయవద్దని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా అన్ని రకాలుగా ఇండస్ట్రీ జనాలు మీడియా అంటే భయపడుతున్న నేపథ్యంలో, బ్యాన్ చేస్తే, ఆందోళన తప్పదని ఇప్పటికే మీడియా హెచ్చిరించిన నేఫథ్యంలో బ్యాన్ వుంటుందా అన్నది అనుమానం. కానీ హీరోల వత్తిడి మాత్రం గట్టిగానే వుందని వినికిడి. హీరోలకు ఏం పోయింది. సమస్య అంతా నిర్మాతలది కదా అని కొందరి వాదన.

కొసరవాళ్లదే హవా

ఇండస్ట్రీలో అయిదువేల మంది నిర్మాతలుగా ఛాంబర్ లో సభ్యత్వం కలిగి వుంటే, రెగ్యులర్ గా సినిమాలు తీసేవారు గట్టిగా యాభైమంది వుండరు. ఈ యాభైమంది సైలెంట్ గానే వున్నారు.

కానీ ఎప్పుడో సినిమాలు తీయడం మానేసి, ఇప్పటికీ ఆ పేరు చెప్పుకు చలామణీ అయిపోతున్నవారు, మూడేళ్లకో నాలుగేళ్లకో ఓ సినిమా తీసేవాళ్లు మాత్రం హడావుడి ఎక్కువ చేస్తున్నారు. ఈ బాపతు జనాలే బ్యాన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే బ్యాన్ వచ్చినా వీళ్లకు సమస్యలేదు. వీళ్లు ఎలాగూ సినిమా తీయరు. వీళ్లకు మీడియాతో సమస్య లేదు. కానీ రెగ్యులర్ గా సినిమాలు తీసేవాళ్ల పరిస్థితి ఏమిటి? అలాంటి వాళ్లు మాత్రం బ్యాన్ ను వ్యతిరేకిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.