దేశవ్యాప్తంగా 'మీ..టూ..' ప్రకంపనలకు కారణమైన బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా గత కొన్నాళ్ళుగా మీడియాకి అందుబాటులో లేదు. ప్రస్తుతం 'మీ..టూ..' వివాదం దాదాపుగా చల్లారిపోయింది. ఓ కేంద్ర మంత్రి తన పదవి పోగొట్టుకునేంతలా 'మీ..టూ..' దేశంలో పెను ప్రకంపనలకు కారణమైన విషయం విదితమే. ఆ 'మీ..టూ..' ఉద్యమం ఆ స్థాయికి చేరడానికి కారణం ముమ్మాటికీ తనూశ్రీ దత్తానే.
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఓ సినిమా షూటింగ్‌లో తనను 'లైంగిక వేధింపులకు' గురిచేశాడంటూ తనూశ్రీ దత్తా ఆరోపణలు చేయడంతోనే, దేశమంతటా ఈ అంశం చర్చకు వచ్చింది. ఆ తర్వాత పలువురు జర్నలిస్టులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల ఘటనల గురించి పెదవి విప్పారు. అలా, ఒకప్పటి సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ ఈ ఉద్యమం దెబ్బకు విలవిల్లాడారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఎంజే అక్బర్ ఆ పదవి నుంచి తొలగాలంటూ ఉద్యమం ఉధృతమయ్యింది.. దాంతో, కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయక తప్పలేదు. బాలీవుడ్‌లో 'మీ..టూ..' ప్రకంపనల దెబ్బకు కొందరు ప్రముఖ నటులే అవకాశాలు కోల్పోయారు.
ఇంతకీ, ఇప్పుడు తనూశ్రీ దత్తా ఏం చేస్తున్నట్లు.? అంటే, తెరవెనుక కొన్ని 'శక్తులు' ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చాయనీ, ఆ కారణంగా ఆమె విదేశాలకు వెళ్ళిపోయిందనీ ప్రచారం జరుగుతోంది. తన గురించి జరుగుతున్న ఈ ప్రచారంపై తనూశ్రీ దత్తా ఇంకా పెదవి విప్పలేదు. సోషల్ మీడియాలోనూ ఇదివరకటిలా యాక్టివ్‌గా కన్పించడంలేదామె. అయితే, ఓ సీనియర్ జర్నలిస్ట్ తన పేరుని ప్రస్తావిస్తూ, 'విమెన్ ఆఫ్ ది ఇయర్..' అంటూ పేర్కొనడంపై మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించింది తనూశ్రీ దత్తా.
కాగా, తనూశ్రీ దత్తా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మీడియాకి దూరంగా వున్నారనీ, కొద్ది రోజుల్లోనే ఆమె తిరిగి 'మీ..టూ..' ఉద్యమాన్ని కొనసాగిస్తారనీ చెబుతున్నారు ఆమె సన్నిహితులు. అయితే, ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్, తనూశ్రీ దత్తాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పరువు నష్టం దావా వేయడం వంటి చర్యల కారణంగా తనూశ్రీ తీవ్రంగా హర్ట్ అయ్యిందనీ, ఇకపై ఆమె 'మీ..టూ..' గురించి ఇంకెక్కడా మాట్లాడదనీ బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.