ఎన్నడూ లేని తలకాయనొప్పి కనిపిస్తోంది టాలీవుడ్ లో. అటు మహేష్ ఇటు బన్నీ సినిమాలు కలెక్షన్ల గొడవలు రాను రాను ముదురుతున్నాయి. మీవి ఫేక్ అంటే మీవే ఫేక్ అంటూ నానా యాగీ జరుగుతోంది. నిజానికి ఒకటి ఎక్కువో, ఒకటి తక్కువో అన్న సంగతి పక్కన పెడితే రెండు సినిమాలకు మంచి షేర్ వస్తోంది. థియేటర్లు సరిపడా వున్నాయి. బయ్యర్లు బాగానే వున్నారు. నిర్మాతలు బాగానే వున్నారు.
కానీ హీరోల ప్రాపకం కోసమో, మరెందుకో, అక్కరలేని ఫిగర్లతో పోస్టర్లు వదలడం, దానిపై సోషల్ మీడియాలో నానా యాగీ జరగడం, ఆపై మీడియాలో వార్తలు రావడం ఇలా నానా రచ్చ తప్పడం లేదు. లైన్ ఆఫ్ ఆర్డర్ చూసుకుంటే, ఇలా సినిమా విడుదల కాగానే అలా 'సంక్రాంతి విన్నర్' అంటూ పోస్టర్ వచ్చేసింది బన్నీ క్యాంప్ నుంచి.
దాంతో ఫస్ట్ వీక్ లో వంద కోట్ల షేర్ అంటూ మహేష్ క్యాంప్ నుంచి పోస్టర్ వచ్చేసింది. దాంతో ఆ వెంటనే బన్నీ క్యాంప్ నుంచి మరో నాలుగయిదు కోట్లు అదనంగా చూపిస్తూ పోస్టర్ రెడీ. దాంతో మహేష్ క్యాంప్ నుంచి ఇంకోటి. దీంతో ఇదంతా కాదు అంటూ, ఏకంగా 180 కోట్ల గ్రాస్ అంటూ బన్నీ క్యాంప్ నుంచి ఇంకో పోస్టర్.
నిజానికి అల వైకుంఠపురములో కలెక్షన్లు కాస్త మెరుగ్గా వున్నమాట వాస్తవం. అలా అని ఆ సినిమా నిర్మాత చినబాబు కయ్యానికి కాలు దువ్వే రకం కాదు. లాభం అయినా, నష్టం అయినా మౌనంగానే వుంటారు. కానీ ఈ సినిమాలో స్లీపింగ్ పార్టనర్ గా వుంటూ, యాభై శాతం లాభాలు తీసుకునే గీతా ఆర్ట్స్ సంస్థ వుండనే వుంది. దానికి తమ హీరో బన్నీ కూడా ముఖ్యం. అందుకే ఇలాంటివి అన్నీ అక్కడ నుంచి పుట్టుకువస్తున్నాయని తెలుస్తోంది.
హీరో కాబట్టి, అవును అనలేక, కాదు అనలేక హారిక హాసిని మౌనంగా వుంది. ఇటు బాణాలు, అటు బాణాలు వస్తూ, ప్యాన్స్ వాటిని అంది పుచ్చుకుని ఒకరిపై మరొకరు విసురుకుంటూ నానా యాగీ చేసుకుంటున్నారు. రెండు సినిమాల నిర్మాతలు నిజమైన విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నారు.