మెగా సినిమా అంటే మెగాస్టార్ సినిమా మాత్రమేకాదు. మెగాస్టార్లు ముగ్గురు కలిసి నటించే సినిమా. అలాంటి సినిమాకు ఓ కథ తన దగ్గర వుందంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్. వాల్మీకి సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఆయన గ్రేట్ ఆంధ్రతో మాట్లాడారు. ఈ సందర్భంగా, పవన్, వరుణ్, సాయితేజ్ ముగ్గురు అయ్యారు, చిరు, చరణ్ తో కూడా చేసేస్తే, అందరు మెగా హీరోలతో పనిచేసిన రికార్డు వస్తుంది కదా? అని ప్రశ్నించగా, మనం అనుకుంటే కాదని, ఆ టైమ్ రావాలని అన్నారు.
సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నానని, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు కలిసి నటించడానికి అవకాశం వున్న మాంచి కథ తన దగ్గర వుందని,ఈ విషయాన్ని ఇప్పుడు తొలిసారి బయటకు చెబుతున్నా ఆయన అన్నారు. తాను వరుణ్ తేజ్ దారిలోకి వెళ్లి క్లాస్ సినిమా తీద్దాం అనుకున్నానని, అయితే వరుణ్ తాను మీ దారిలోకి వస్తా, మాంచి మాస్ సినిమా ఇవ్వండి అని అడిగడంతో ఈ సినిమా ప్రయాణం ప్రారంభమైందన్నారు.
దాగుడు మూతలు సినిమా చేద్దాం అనుకున్న టైమ్ లో ఎందుకో జిగర్తాండ సినిమా చూస్తుంటే వరుణ్ తేజ్ ను బాబీ సింహా క్యారెక్టర్ లో ఊహించుకున్నానని అలా ఈ సినిమా ప్రారంభమైందని అన్నారు. అయితే చాలా మంది సిద్దార్థ క్యారెక్టర్ కోసం వరుణ్ ను అడిగానని అనుకున్నారన్నారు. తానుకూడా సిద్దార్ధ క్యారెక్టర్ కోసమే జిగర్తాండ ఓసారి చూడమని హరీష్ చెప్పారని అనుకున్నానని వరుణ్ తేజ్ కూడా అనడం విశేషం.
దబాంగ్ ను జిరాక్స్ లా తీసి గబ్బర్ సింగ్ చేయలేదని, అందుకే మార్పులు, మాటలు అంటూ తనకు ఓ టైటిల్ కార్డ్ వేసుకున్నా అని హరీష్ అన్నారు. జిగర్తాండ కూడా అలాగే తగినన్ని మార్పులు చేర్పులు చేసా అన్నారు. మంచి పుస్తకం ఏ భాషలో వున్నా ఎలా చదువుతామో? మంచి సినిమా ఏ భాషలో వున్నా, తెలుగులో అందించడంలో తప్పు లేదని, చేసినవి రెండు రీమేక్ లే అయినా, తనపై రీమేక్ లే చేస్తాననే ముద్రవేసినా, మంచి సినిమా దొరికితే మాత్రం రీమేక్ చేయకుండా వదలనని హరీష్ స్పష్టం చేసారు.
వాల్మీకి సినిమా ఎంత హిట్ అవుతుంది. ఎన్ని డబ్బులు వస్తాయి ఇలాంటివి తాను చెప్పలేనని, అదంతా జనం చేతుల్లో వుండేదని, కానీ ఒకటి మాత్రం స్ఫష్టం చేస్తానని, కొన్నేళ్ల తరువాత అయినా ఈ సినిమా గురించి తాను కానీ, హీరో కానీ సంతృప్తిగా మాట్లాడుకునే రేంజ్ లో వుంటుందన్న విషయం మాత్రం పక్కా అని వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి సైరా స్టిల్స్ చూస్తున్న కొద్దీ ఆ సినిమా ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చూస్తానా? అని వుందని, వాల్మీకి సినిమా సైరా ముందు విడుదలవుతోందని, అంటే ఒక విధంగా ఆ సినిమాకు స్వాగతం చెబుతోందని హరీష్ అన్నారు.