నిప్పు లేకుండా పొగ రాదు. కానీ టాలీవుడ్ లో నిప్పు వున్నా లేకున్నా పొగ రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. గత వారం పది రోజులుగా టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల క్వాలిటీ వ్యవహారాలు అన్నీ తానే స్వయంగా చూసుకుంటున్నారని. అనేక వందల సినిమాలు చేసిన అనుభవం మెగాస్టార్ స్వంతం.
ఎన్నో సక్సెస్ లు, ఫ్లాప్ లు చూసారు ఆయన. ఆడియన్స్ పల్స్ ఏమిటన్నది పక్కాగా తెలుసు. పైగా ఆయన చుట్టూ కొంతమంది అనుభవజ్ఞులు వున్నారు. వారి సలహా సంప్రదింపులు సదా తీసుకుంటూ వుంటారు.
అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాల దర్శకుల పనితీరు పట్ల కాస్త అసంతృప్తిగా వున్నారని, దాంతో తన టీమ్ ను రంగంలోకి దింపి క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారని వినిపిస్తోంది. తను చేస్తున్న సినిమాల్లో ఓ సినిమా డైరక్టర్ కు అయితే గట్టి క్లాస్ పీకారని కూడా ప్రచారం సాగుతోంది.
అంతన్నావ్..ఇంతన్నావ్..చేస్తున్నదేమిటి అని ఆయన ఆ డైరక్టర్ కు క్లాస్ పీకేసారని చెప్పుకుంటున్నారు. నిజమెంతో మెగాస్టార్ కే తెలియాలి. ఈ గ్యాసిప్ లు విని బాధ పడుతున్న సదరు డైరక్టర్ మీడియా జనాలను షూటింగ్ స్పాట్ కు పిలిచి, తానే డైరెక్ట్ చేస్తున్నా అనే విషయం చాటాలని కూడా అనుకుంటున్నారట.
ఏమైనా సీనియర్లను యంగ్, చిన్న డైరక్టర్లు డైరెక్ట్ చేసేది ఏమీ వుండదు. సీన్ చెప్పడం, చేసింది చూసి కట్ ఒకె చెప్పడం తప్ప. మరీ ధైర్యంగా రెండు మూడు టేక్ లు చేయించలేరు. అలా చేయించినా సమస్యే. పెద్ద దర్శకులకు మాత్రమే ఆ పాజిబులిటీ వుంటుంది.
మొత్తం మీద మెగాస్టార్ సినిమాల విషయంలో న్యూస్ ల కన్నా గ్యాసిప్ లు ఎక్కువ వినిపిస్తున్నాయి.