‘మెగా’ ముచ్చటేదీ?

‘మెగాస్టార్‌’ చిరంజీవి ముచ్చటేదీ? ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?…కొంతకాలంగా ఈ ప్రశ్నలకు జవాబులు తెలియడంలేదు. ఎన్నికలు ముగిసి చాలాకాలమైంది. కేంద్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెసు సహా అన్ని పార్టీలు ఎన్నికలపై…

‘మెగాస్టార్‌’ చిరంజీవి ముచ్చటేదీ? ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?…కొంతకాలంగా ఈ ప్రశ్నలకు జవాబులు తెలియడంలేదు. ఎన్నికలు ముగిసి చాలాకాలమైంది. కేంద్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెసు సహా అన్ని పార్టీలు ఎన్నికలపై సమీక్షలు, ఆత్మశోధనలు చేసుకోవడం పూర్తయింది. ఓడిపోయిన పార్టీలకు ప్రభుత్వాలను ఎండగట్టడం తప్ప మరో పనేమీ లేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు నాయకులకు ఇటు అసెంబ్లీలోనూ, అటు పార్లమెంటులోనూ స్థానం దక్కలేదు కాబట్టి వారికి రాజకీయంగా పెద్దగా కార్యకలాపాలేమీ లేవు. ప్రస్తుతం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. ముందు ముందు ప్రభుత్వ విధానాలపై రోడ్డెక్కి ఆందోళనలు చేస్తారేమో తెలియదు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? రాజకీయంగా ఆయన కార్యకలాపాలేమిటి? సినిమా పరంగా ప్రోగ్రెస్‌ ఏమిటి?…ఇప్పటివరకు ఏ సమాచారమూ లేదు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. తాపీగా పార్లమెంటు సమావేశాలకు వెళ్లొస్తే సరిపోతుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసును మళ్లీ బతికించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఆయనకు ఎటువంటి బాధ్యత అప్పగిస్తున్నారో కూడా ఇప్పటివరకూ సమాచారం లేదు. ఆంధ్ర రాజకీయాల్లో చిరు చురుగ్గా ఇన్‌వాల్వ్‌ అవుతున్న దాఖలాలు కనబడటంలేదు. కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసుకు ప్రజలు ‘సమాధి’ కట్టిన విషయమై సోనియా సమక్షంలో ‘రివ్యూ మీటింగ్‌’ జరిగింది. ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ చిరుయే కాబట్టి మేడమ్‌ ఆయనకు బాగానే అక్షింతలు వేసుండొచ్చు. ఆ తరువాత ఆయన రాజకీయ కార్యకలాపాలేమీ లేవు. సినిమా జీవితాన్ని విజయవంతంగా నిర్మించుకుని ‘మెగాస్టార్‌’గా ఎదిగిన చిరంజీవి కొంత కాలం కేంద్రంలో సహాయ మంత్రి పదవి అనుభవించడం తప్ప పెద్దగా సాధించింది ఏమీ లేదు. ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ సినిమాతో 149 చిత్రాలు పూర్తి చేసుకున్న చిరు ఆ వెంటనే రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో రౌండ్‌ ఫిగర్‌ అలాగే మిగిలిపోయింది. ప్రస్తుతం 150 చిత్రం చేయడం తప్ప ఆయనకు మరో ధ్యాస ఉన్నట్లు కనబడటంలేదు. ఒక రాజకీయ నాయకుడిగా రెండు రెండు ప్రభుత్వాల పనితీరుపై, తీసుకుంటున్న నిర్ణయాలపై ఏ కామెంట్లు చేయడంలేదు. సలహాలు, సూచనలు ఇవ్వడంలేదు. 

కొత్త సినిమా కలకలమేదీ?

చిరంజీవి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సమయంలోనే అంటే రాజ్యసభ సభ్యుడై, మంత్రి పదవి చేపట్టిన తరువాత కూడా అనేక సందర్భాల్లో ఆయన 150వ సినిమా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై చిరు కూడా స్పందించి తన సినిమా అభిలాషను వ్యక్తం చేశారు. ఈ సినిమా కథ, దర్శకుడు వగైరా అంశాలపై చాలాకాలం చర్చ జరిగింది. కథ ఏమిటనేదానిపై, దర్శకుడు ఎవరనేదానిపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. కాని కాలక్రమంలో ఆ ‘కలకలం’ తగ్గుముఖం పట్టింది. అంతర్గతంగా ఏం చర్చలు జరుగుతున్నాయో తెలియదుగాని, కొన్నాళ్లుగా చిరు కొత్త సినిమాపై వార్తలేమీ రావడంలేదు. రాజకీయాల ఊపు తగ్గాక చిరు కొత్తగా నటించబోయే సినిమా కోసం ఆయన అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. కాని ఆ సినిమా ప్రోగ్రెస్‌పై ఏ వార్తలూ లేకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమా వార్తలు, ఆయన ఫొటోలే పెట్టుబడిగా జోరుగా నడిచిన సినిమా పత్రికల్లో ఇప్పుడు ఇప్పుడాయన వార్తలు, సినిమా స్టిల్స్‌ కనిపించక అభిమానులు వెలితిగా ఫీలవుతున్నారు. ఇదివరకు చిరు 150వ సినిమా గురించి అనేకమంది దర్శకులు, సినిమా ప్రముఖులు మాట్లాడారు. పెద్ద దర్శకులంతా కథలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు. చిరు కథలు వింటున్నాడని అన్నారు. మరి ఆయన ఏ కథలు విన్నారో, ఏం చేయబోతున్నారో తెలియడంలేదు. 

‘ఉయ్యాలవాడ’ ఖరారు కాలేదా?

చిరంజీవి ఒక బ్రహ్మాండమైన బంపర్‌ హిట్‌ సినిమాతో రాజకీయరంగ ప్రవేశం చేస్తారని ఆయన ‘ప్రజారాజ్యం’ పెట్టేముందు ప్రచారం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే పేరు ప్రచారంలో ఉంది. స్క్రిప్టుతో సహా అది సిద్ధంగా ఉందని వార్తలొచ్చాయి. అయినా 150వ సినిమా కథ కోసం ఇంకా అన్వేషణ సాగుతూనే ఉంది. కథ సిద్ధమైందని కొందరు, కాలేదని కొందరు చెబుతున్నారు. చిరు సినిమాను బాలమరిది అల్లు అరవింద్‌`కుమారుడు రామ్‌చరణ్‌ సంయ్తుంగా నిర్మిస్తారని వార్తలొచ్చాయి. అయితే వేరే ప్రొడక్షన్‌లో చేస్తేనే బాగుంటుందని చిరు భావిస్తున్నారట..! తన 150వ సినిమాకు పారితోషకం భారీగానే తీసుకోవాలని చిరు అనుకుంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు 20 కోట్లు తీసుకుంటున్నారని, తాను మెగా స్టార్‌ని కాబట్టి 30 కోట్లు తీసుకోవాలని చిరు అనుకుంటున్నారట. తక్కువ పారితోషికం తీసుకుంటే తన ఇమేజ్‌కు భంగమని కూడా భావిస్తున్నట్లు కొందరు సినిమా జర్నలిస్టులు చెబుతున్న సమాచారం. మరి ఇంత భారీగా ఈ సినిమా ఎవరు నిర్మిస్తారో తెలియదు. టాలీవుడ్‌లో మరో సమాచారం కూడా షికారు చేస్తోంది. అదేమిటంటే….చిరు సినిమాకు ఇంతవరకు కథ సిద్ధం కాలేదు. మంచి కథ సినిమా సూపర్‌డూపర్‌ హిట్టయ్యేలా బ్రహ్మాండమైన కథ అందించిన రచయితకు కోటి రూపాయల పారితోషికం ఇవ్వడానికి చిరు సిద్ధంగా ఉన్నారట. దీంతో బడా రచయితలు రంగంలోకి దిగి కథపై కుస్తీ పడుతున్నారని అంటున్నారు. బాడీ ఫిట్‌నెస్‌ పెంచుకునే పనిలో చిరు బిజీగా ఉన్నాడని, ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నారని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. 

‘మెగా’ చిత్రానికి దర్శకత్వం ఎవరికో..!

మెగాస్టార్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అదృష్టం ఎవరిని వరిస్తుందోనని టాలీవుడ్‌ జనమే కాకుండా ఆయన అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదివరలో హిట్లు ఇచ్చిన దర్శకులే కాకుండా ఈమధ్య కాలంలో సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన దర్శకులు కూడా చిరు సినిమా కోసం కాచుకొని ఉన్నారట. ఇతర భాషల్లో విజయవంతమైన కొన్ని సినిమాల గురించి కూడా చిరు తెలుసుకుంటున్నారట. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా చిరు 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే బాగుంటుందని ఆశపడుతున్నట్లు పాత్రికేయులు చెబుతున్నారు. చిరు కూడా మణిరత్నంపై ఆసక్తిగా ఉన్నారట. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టులో చిరు నటించేలా మణి భార్య, గతంలో చిరుతో హీరోయిన్‌గా నటించిన సుహాసిని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

చిరు సినిమా కాంగ్రెసుకు ఊపిరా?

చిరంజీవి 150వ సినిమా కాంగ్రెసు పార్టీకి ఊపిరి పోయవవచ్చని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తన సినిమా కాంగ్రెసు పార్టీ పునరుజ్జీవానికి ఉపయోగపడేలా ఉండాలని గతంలో చిరు కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉండగా, రాజకీయంగా చిరు పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. ఒకప్పుడు సినిమాల ద్వారా ప్రజలతో నిరంతర సంబంధాలున్న చిరంజీవికి రాజ్యసభ సభ్యుడయ్యాక ఆ సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం పార్టీ ఎక్కడా అధికారంలో లేదు కాబట్టి రాజకీయ నాయకుడిగా ప్రజలు ఆయన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేయగలిగిన పనల్లా ఎంపీ లాడ్స్‌ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం. ఈ నిధులను తనకిష్టమైన ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయొచ్చు. మొత్తం మీద చిరు సినిమా ఎన్నో ఆశలు రేపుతోంది. రాజకీయంగా విఫలమైన తాను ఈ సినిమా ద్వారా తన ‘మెగా’ ఇమేజ్‌ తగ్గలేదని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. దాని కోసమేనేమో ఇంత జాప్యం చేస్తున్నారు. 

-ఎం.నాగేందర్‌