సీరియల్స్ అంటే కేవలం అది హోం మేకర్స్‌కు సంబంధించిన విషయాలే. సంవత్సరాలకు సంవత్సరాల పాటు జీడిపాకంలా సాగే వీటి పట్ల ఆసక్తి ఆడవాళ్లేక ఉంటుంది. అయితే కొన్ని సీరియల్స్ మరో రకంగా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ఇవి కూడా సాస్ బహూ డ్రామాలే అయినా.. కొన్ని వ్యవహారాలు వీటిని ప్రధాన వార్తల్లోకి వచ్చేలా చేస్తాయి. ఇలా అందరి దృష్టిలోకి వచ్చిన సీరియల్స్‌లో ఒకటి ‘బాలికా వధూ’. మొదలైన కొత్తలో బాల్య వివాహాలు మంచిది కాదన్న సందేశమివ్వడం ద్వారా ఆసక్తి రేపిన ఈ సీరియల్‌కు అందులో నటించిన అవికా గోర్ ప్రధాన ఆకర్షణగా మారింది.
ఈ సీరియల్లో చిన్న పాపగా అవిక దేశ వ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుంది. నటన, క్యూట్ నెస్ ద్వారా తనకు దక్కిన గుర్తింపుతో ఈ సీరియల్‌ను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లింది అవికా. ‘చిన్నారి పెళ్లి కూతురు’ పేరుతో ఈ సీరియల్ తెలుగులోకి డబ్ కాగా.. టాలీవుడ్ ఆ చిన్నారి పెళ్లి కూతురు అవికాను హీరోయిన్గా మార్చేసింది! టాలీవుడ్‌కు ఒక హీరోయిన్ను అందించిన సీరియల్‌గా ఇది ప్రత్యేకంగా నిలిచింది.
అంతేనా.. ఈ సీరియల్లో అవిక తర్వాత ఆ పాత్రను చేసిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య మరో సంచలనం. ఆమె సూసైడ్‌కు సంబంధించిన మిస్టరీ పై ఇంత వరకూ పూర్తి క్లారిటీ రాలేదు. ప్రత్యూష మరణానంతరం ప్రధాన పాత్రలో మరో అమ్మాయిని పెట్టి ఈ సీరియల్‌ను లాగించారు. ఓవరాల్ హిందీతోపాటు వివిధ భారతీయ భాషల్లో ఈ సీరియల్ ఏడెనిమిదేళ్లు సాగినట్టుంది. ఈ నేపథ్యంలో దీనికి ముగింపును ఇస్తున్నారట. ఈ నెలాఖరుతో ఈ సీరియల్‌కు శుభం కార్డు వేయబోతున్నారని సమాచారం. మొత్తానికి అనేక రకాలుగా వార్తల్లోకి వచ్చిన ఒక మెగా సీరియల్ ముగుస్తోందనమాట!