సినిమాల్లోకి మళ్ళీ రావాలా.? వద్దా.? అన్న కన్‌ఫ్యూజన్ నుంచి తేరుకోవడానికే చిరంజీవికి చాలా టైమ్ పట్టేసింది. టైమ్ అంటే అలా ఇలా కాదు, ఏకంగా ఐదారేళ్ళకుపైగానే పట్టేసింది. ఎలాగైతేనేం, సినిమాల్లో మళ్ళీ నటించాలనే నిర్ణయం తీసుకున్నారు. 'రెండు పడవల మీద ప్రయాణం కష్టం' అన్న మాటను పక్కన పెట్టి, అటు రాజకీయం.. ఇటు సినిమాలు.. అంటే, రాజకీయాల్ని తగ్గించేసి, సినిమాల్లోకి వచ్చేద్దామనుకున్నారు చిరంజీవి.
సరే, చాన్నాళ్ళ తర్వాత సినిమాల్లో నటించాలనే నిర్ణయం తీసుకున్నారుగానీ, ఏ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వాలో తెలియలేదు. దానికి మళ్ళీ పెద్ద కసరత్తు.. దాదాపు రెండేళ్ళు కిందా మీదా పడి, 'కత్తి' సినిమాని తెలుగులోకి రీమేక్ చేసేద్దామనుకున్నారు. ఈలోగా పూరితో సినిమా డిస్కషన్స్‌లోకి వచ్చి, అటకెక్కేసింది. అలా పెద్ద ప్రసహనం ముగిసి, మెగాస్టార్ హీరోగా నటించే సినిమా పట్టాలెక్కింది.
మళ్ళీ ఇక్కడ రకరకాల అనుమానాలు తెరపైకి రావడంతో మెగా క్యాంప్‌లో అలజడి బయల్దేరింది. చాన్నాళ్ళ తర్వాత నటిస్తున్న చిరంజీవి, షూటింగ్‌లో ఎలా వుంటున్నారు.? మునుపటి జోష్ ఆయనలో వుందా.? అన్న విషయమై బోల్డన్ని గాసిప్స్ విన్పిస్తున్నాయి. పైగా, 'అఖిల్' వంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో సినిమా గనుక, అన్ని విషయాల్లోనూ చిరంజీవి 'అతి జాగ్రత్త' తీసుకోవడం తప్పడంలేదట. దాంతో, షూటింగ్‌లో అప్పుడప్పుడూ గందరగోళం తలెత్తుతోందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి.
దర్శకుడిగా పేరు వినాయక్‌దే అయినా, దర్శకత్వ పర్యవేక్షణ అంతా చిరంజీవి కనుసన్నల్లోనే జరుగుతోందట. ఇలా అయితే ఔట్ పుట్ ఎలా వస్తుందో.? అన్న అనుమానాలు ఓ పక్క, సినిమా చాలా అద్భుతంగా వస్తోందన్న వాదనలు ఇంకోపక్క.. వెరసి, చిరంజీవి సినిమాకి సంబంధించి భిన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా సూపర్బ్‌గా వస్తోందనీ, షూటింగ్ స్పాట్‌లో చిరంజీవి మునుపటి జోష్‌తోనే కనిపిస్తున్నారనీ చెబుతున్నారు.
అంతా బాగానే వుందిగానీ, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.? హీరోయిన్ పేరు ప్రకటించకుండా ఎన్నాళ్ళు నెట్టుకొచ్చేస్తారు.? అన్న ప్రశ్నలూ తెరపైకి వస్తున్నాయి. ఏమో, హీరోయిన్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారోగానీ, సినిమా విడుదలయ్యేదాకా మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా విషయంలో కుప్పలు తెప్పలుగా గాసిప్స్ షికార్లు చేస్తూనే వుంటాయి.