ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర అంటే హీరో మహేష్ బాబు కు అత్యంత సన్నిహితుడు. అనిల్ సుంకర, మహేష్ బాబు కుటుంబాల నడుమ సన్నిహిత సంబంధాలు వున్నాయి. అలాగే అనిల్ సుంకర నిర్మించిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు చీఫ్ గెస్ట్ గా ప్రత్యేకంగా వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అదే విధంగా హీరో మహేష్ బాబు అంటే ప్రత్యేకమైన అభిమానం హీరో చిరంజీవికి.
ఈ ట్రయాంగిల్ ఫ్రెండ్ షిప్ మరోసారి రుజువు అవుతోంది. అనిల్ సుంకర నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఫిక్స్ అయినట్లే. తమిళ సినిమా వేదాలం ను తెలుగులో మెహర్ రమేష్ డైరక్షన్ లో నిర్మిస్తారని గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వేదాలం రీమేక్ రైట్స్ అనిల్ సుంకర దగ్గరే వున్నాయి. ఇప్పటికే మెహర్ రమేష్ స్క్రిప్ట్ ను అనిల్ సుంకరకు నెరేట్ చేసినట్లు బోగట్టా.
ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆసక్తి కరమే..ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో వస్తుంది.