ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేయాలని నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలో మంగళవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రామ్‌మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు సోము వీర్రాజు మరింత కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజధాని అంశంపై మరోసారి బీజేపీ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం అడ్డుకోలేదన్నారు. రాజధాని అంశంపై కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదన్నారు. కేంద్రం తన పరిధిలోనే వ్యవహరించిందని రామ్‌మాధవ్ మరోసారి తమ వైఖరిని సమర్థించుకున్నారు.
మోదీ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబు యుద్ధం చేయాలని చూశారన్నారు. విభజన చట్టంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పెట్టారన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ 5 లేదా 10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చంద్రబాబుకు చెప్పినట్టు రామ్ మాధవ్ గుర్తు చేశారు. అయితే హైదరాబాద్‌ను వదిలి చంద్రబాబు హడీవుడిగా ఎందుకొచ్చారో అందరికీ తెలుసని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.