తెలుగుదేశం ఇపుడు అందరికీ దొరికేస్తోంది. చెట్లకు పండ్లున్నాయి. కాపలాదారు కడు బలహీనం. దాంతో ఎవరైనా ఏరేసుకోవాలని, బుట్టలో పెట్టేసుకోవాలని ఆరాటపడతారు. ఇది సహజం.
రాజకీయాల్లో తీసుకుంటే అంతా అవకాశవాదమే కదా. ఎప్పటికి ఏది అవశ్యమో అది చేయడంలోనే చాణక్యం దాగుంది. ఇపుడు విశాఖ రాజధాని కాబోతోంది. దాంతో బలహీనంగా ఉన్న బీజేపీ అరువు తెచ్చుకునైనా అక్కడ బలం పెంచుకోవాలనుకుంటోంది. దీనికోసం టీడీపీ మీదనే చూపు పెట్టిందని భోగట్టా.
ఉత్తరాంధ్రాలో నిన్నటివరకూ బలంగా ఉన్న తమ్ముళ్ళు ఇపుడు విపక్షంలోకి చేరి దిగాలుగా చూస్తున్నారు. అలాంటి వారిని తన వైపు తిప్పుకోవాలని బీజేపీ ఎత్తులు వేస్తోందని ప్రచారం సాగుతోంది. బలమైన సామాజికవర్గానికి చెందిన వారు, మాజీ మంత్రులు బీజేపీ టార్గెట్ గా ఉంది.
రానున్న రోజులు తమవేనని చెప్పడానికి బీజేపీ భారీ స్కెచ్ వేస్తోంది. దీంతో తాము కరడు కట్టిన టీడీపీ నేతలమని చెప్పుకునే వారు కూడా ఇపుడు సైకిలి గాలి తగ్గిపోవడంతో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తున్నారుట.
ఈ పరిణామాలు టీడీపీలో కలవరం రేకెత్తిస్తూంటే బీజేపీ మాత్రం ఆపరేషన్ టీడీపీని మొదలుపెట్టేసింది. ఉత్తరాంధ్రాలో పట్టు సాధించడానికి ఇంతకు మించిన తరుణం దొరకదు అని బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తోంది, మరి కమలం గాలానికి చిక్కే వారెవరో చూడాలి.