మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళన కరంగా ఉన్నట్టుగా సమాచారం. బ్రెయిన్ కు సంబంధించిన సర్జరీ చేయించుకున్న ప్రణబ్ ను ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన కరోనా బారిన పడినట్టుగా కూడా తెలుస్తోంది. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని ప్రణబ్ అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్టు చేశారు. అటు శస్త్రచికిత్స కు సంబంధించిన వైద్యం చేయించుకుంటూ ప్రణబ్ కరోనాను కూడా ఎదుర్కొంటున్నారు.
ఈ మాజీ రాష్ట్రపతి ఆరోగ్యంపై ప్రముఖులు వాకబు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రణబ్ ను ఆసుపత్రిలో పరామర్శించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలు ప్రణబ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ లు చేశారు. ప్రస్తుతం ప్రణబ్ వయసు 84 సంవత్సరాలు.
కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నేతగా పేర్గాంచారు. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ పాత్రను పోషించారు. ప్రణబ్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమై ఆయన రాష్ట్రపతిగా వెళ్లాకే కాంగ్రెస్ కు కష్టాలు మరింత అధికం అయ్యాయి. ప్రణబ్ వంటి చేతల మనిషిని ప్రధానిగా చేయకుండా సోనియా గాంధీ పాలనపై తన పట్టు ఉండేలా చూసుకుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే రాష్ట్రపతి చేసి ఆయనకు గౌరవాన్ని అయితే ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ను మళ్లీ ప్రధాని అభ్యర్థిగా తీసుకురావాలని గత ఎన్నికల ముందు కొంత కసరత్తు సాగినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది సాధ్యపడినట్టుగా లేదు, దానిపై ప్రణబ్ కూడా అంత ఆసక్తి చూపినట్టుగా లేరు.