టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ ట్విటర్ గన్ ఎక్కు పెట్టారు. ఇటీవల విజయ సాయిరెడ్డి కరోనా బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స పొందారు. పదిరోజులకు కోలుకుని తిరిగి రాజకీయంగా అలర్ట్ అయ్యారు. చంద్రబాబు అంటే ట్విటర్లో విజయసాయిరెడ్డి ఒంటికాలిపై లేయడం తరచూ చూస్తుంటాం. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుం టున్న సందర్భంలో మాత్రమే బాబును విడిచిపెట్టారు. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత బాబుపై మళ్లీ ట్వీట్ల బుల్లెట్లను పేల్చుతున్నారు.
తాజాగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్స్‌తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబువి డ్రామాలని ఎత్తిపొడిచారు. అలాగే బట్టలు విడిచిన రాజుతో చంద్రబాబును పోల్చి రాజకీయ వేడి రగిల్చారు. బాబుపై విజయసాయి చేసిన రెండు వేర్వేరు ట్వీట్ల సంగతేంటో చూద్దాం.
“సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్లపాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరం అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్” అంటూ బాబుపై ఫైర్ అయ్యారు. అసలు పోలవరం డ్యామ్ పునాదులే వేయలేదని విజయసాయిరెడ్డి చెప్పడం సరికొత్త విషయం.
విజయసాయి చేసిన మరో ట్వీట్ ఏంటంటే … “బట్టలు విడిచిన మూర్ఖపు రాజు.. తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించటం లేదనుకున్నాడట! 175కు 151 ఓడిన, కొడుకును కూడా ఓడగొట్టుకున్న చంద్రబాబు… 13 జిల్లాల్ని తాను అభి వృద్ధి చేశానని ఏవేవో గ్రాఫిక్స్ ఇప్పుడు చూపిస్తున్నాడట! షేమ్.. షేమ్.. బాబూ…!” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉంటాయి. విజయసాయి ట్వీట్లపై టీడీపీ నేతలు ఇచ్చే కౌంటర్లపై ఆసక్తి నెలకొంది.