మెగాభిమానుల చిరంజీవి దీక్షామాల

అయ్యప్ప మాల అందరికీ తెలిసిందే, ఇంక భవానీ మాల కూడా. అలాగే బాబా దీక్ష ఇంకా చాలా వున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన ఆరాధ్య దైవమైన ఆంజనేయస్వామి కోసం పేరు కలిసి వచ్చేలా…

అయ్యప్ప మాల అందరికీ తెలిసిందే, ఇంక భవానీ మాల కూడా. అలాగే బాబా దీక్ష ఇంకా చాలా వున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన ఆరాధ్య దైవమైన ఆంజనేయస్వామి కోసం పేరు కలిసి వచ్చేలా చిరంజీవి మాల వేస్తారట. ప్రతి ఆగస్టులో చిరు బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు చిరంజీవి మాల వేసి,  దీక్ష ముగిసాక ఆంజనేయస్వామి గుడిలో మాల తీస్తారట.

చిరంజీవి 61వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఏం చేయాలి..ఎలా చేయాలి, అన్నదానిపై  వివరంగా ఓ బ్రోచెర్ నే రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో ఈ చిరంజీవి దీక్షామాల కార్యక్రమం ఒకటి. చిరంజీవి 60 పుట్టిన రోజు సందర్భంగా కూడా చిరు అభిమానులు బాగా హడవుడి చేసారు. అభిమానుల్లో వున్న వర్గాల కారణంగా కాస్త గడబిడ కూడా జరిగింది. ఈసారి అందుకే మెగా బ్రదర్ నాగబాబు ముందుగానే అభిమానులతో సమావేశమై, అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవద్దని, ఎలాగూ 150 వ సినిమా విడుదల వుంటుంది కాబట్టి, అప్పుడు హడావుడి చేయవచ్చని సూచించారట.

వివరణ ఇచ్చిన నాగబాబు

మెగాభిమానులను గతంలో ఓ సమావేశంలో నాగబాబు గట్టిగా మందలించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ నినాదాలకు విసిగి ఆయన అప్పట్లో అలా మందలించారు. ఇప్పుడు దానిపై ఫ్యాన్స్ కు నాగబాబు వివరణ ఇచ్చినట్లు వినికిడి. ఆ మందలింపు అభిమానులకు కాదని, ఎవరైతే కావాలని మెగా మీటింగ్ ల్లో గడబిడ చేస్తున్నారో వారికే నని వివరించారట. ఇటీవలే బన్నీ కూడా ఇలాంటి వివరణే ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగా బ్రధర్స్ ముగ్గురం ఒకటే అని, చిన్న చిన్న విషయాలు వున్నా, తాము ఒక్కటిగానే వున్నామని నాగబాబు అభిమానులతో అన్నారట.